కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తనకు తాను నిఖార్సైన మనిషిగా సర్టిఫై చేసుకుంది. తానెప్పుడూ నిజాలే మాట్లాడుతానని, అందుకే అందరూ తనను ద్వేషిస్తుంటారని జస్టిఫై చేసుకునే ప్రయత్నం చేసింది. సామాజిక మాద్యమాల్లో యాక్టివ్ గా ఉండే ఈ బాలివుడ్ తార నిరంతరం వివాస్పద పోస్టులతో చర్చల్లో నిలుస్తుంది. నటిగా తనను అభిమానించే వాళ్లు సైతం కంగన తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పొలిటిలక్ స్టాండ్స్ పట్ల కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని కంగనా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే… తనకు తాను నిజాయితీకి నిలువెత్తు రూపమని ప్రకటించుకుంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి మొదలు రైతు ఆందోళనల వరకు అన్నింటినీ తనదైన స్టైల్ లో అంచనా కట్టడం కంగనా ప్రత్యేకత. బాలీవుడ్ లో నెపొటిజం అంటూ సంచలన కామెంట్స్ చేసిన ఈ బాలీవుడ్ నటి వ్యక్తిగతం పలువరు నటీనటులపై ఘాటు విమర్శలు చేసింది. అది హృతిక్ రోషన్ మొదలు కరన్ జోహర్, అలియాభట్, తాప్సీ, ఉర్మిళ, జావేద్ అక్తర్ ఇలా పలువురు సనీ ప్రముఖులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన కంగన వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. కేవలం సినీ రంగంపైనే కాదు… ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, విద్యార్థి, రైతు ఉద్యమాలపై కూడా అసహనాన్ని ప్రదర్శించింది కంగనా. అధికార బీజేపీని భుజాలకెత్తుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజలను కించపరచడానికీ వెనకాడని వైనం కంగనా సొంతం. ఈ వైఖరి కారణంగానే కంగన పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తన నిజాయితీ వల్లే వ్యతిరేకతను ఎదుర్కోవల్సి వస్తోందనే వాదనను ముందుకు తెచ్చింది కంగనా. చిత్ర పరిశ్రమలో దాగిన వాస్తవాలను వెల్లడించినందుకు ఇండస్ట్రీ వర్గాలకు తన పట్ల ఆగ్రహమని, రిజర్వేషన్లను వ్యతిరేకించినందుకు పలు సామాజిక వర్గాలకు తనపై ఆగ్రహమని అంటోంది. మణికర్ణిక వివాదంలో కర్ణిసేనతో తలపడ్డందుకు రాజ్ పుత్ లు తనను వ్యక్తిరేస్తున్నారని, ఖలిస్తానీల గురించి మాట్లాడినందుకు సిక్కులు తనను వ్యతిరేకిస్తున్నారని, ఇస్లాం గురించి మాట్లాడినందుకు ఇతరులు వ్యతిరేకిస్తున్నారని ఏకరువుపెట్టింది. ఎవరు తనను మెచ్చుకోకపోయినా…. తన మనస్సాక్షి మాత్రం తనను ప్రశంసిస్తూనే ఉంటుందని కంగనా తనను తాను సమర్థించుకుంది.
రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండడం తప్పు కాదు. కానీ… వాటి వ్యక్తీకరణ కోసం ఇతరులను అవమానించడం ఎంతమేరకూ హర్షించతగింది కాదు. ఈ విషయంలో కంగనా రనౌత్ బాద్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుంటుంది. అధికార పార్టీని సమర్థించే ఆరాటంలో ప్రజా ఉద్యమాలను కించపరచడం కంగనాకు పరిపాటుగా మారింది. తాజాగా నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు చేస్తున్న ఆందోళనపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా. రైతు ఆందోళనల్లో పాల్గొంటన్న వారిని అద్దెమనుషులుగా పేర్కొంది. అంతకు ముందు సీఏఏకి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు ఆందోళన చేసిన షాహిన్ బాగ్ మహిళలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. ప్రజల న్యాయమైన డిమాండ్లపై రాళ్లేయడం… వారిని విచ్ఛన్నకారులుగా పేర్కొనడం కంగనా స్టైల్. ఈ పద్ధతి వల్లే కంగనా విమర్శలు ఎదుర్కోవల్సి వస్తోంది. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా తన మనస్సాక్షి తనను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటుందని వ్యాఖ్యానించడం చూస్తుంటే… ఆ మనస్సాక్షి బీజేపీయే అని అర్థమవుతుంది. ఎందుకంటే… కంగనా కామెంట్స్ పట్ల అంతగా మురిసిపోయేది కాషాయదళమే కనుక.