Idream media
Idream media
తమిళనాడు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడి కమల్ పార్టీ ఓడిపోవడంతోపాటు ఆయన కూడా ఓటమి పాలయ్యారని తెలిసినప్పటి నుంచీ మక్కల్ నీది మయ్యం పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నారు. వాళ్లంతా పార్టీలో కీలక నేతలుగా ఉన్నవారే. పార్టీ ఓడిపోయింది కాబట్టి వాళ్లు వదిలేసి వెళ్తున్నారు స్వార్థపరులు అనుకోవచ్చు. కానీ.. వెళ్లే వాళ్లంతా కమల్ పై ఒకేవిధమైన ఆరోపణలు చేస్తూ వెళ్లడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పార్టీలో కీలక నేతలుగా ఉన్న ఏజీ మౌర్య మురుగనందన్ సీకే.కుమరావెల్ ఉమాదేవీ ఫలితాలు వచ్చిన వారంలోనే వెళ్లిపోయారు. కాస్త గ్యాప్ తో పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ కూడా వెళ్లిపోయారు. ఇలా పార్టీలోని ముఖ్యలు వెళ్లిపోతుండడంపై కమల్ పార్టీపై ఎన్నో చర్చలు మొదలయ్యాయి. కమల్ పార్టీ ఉంటుందా, ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలకే పరిమితం అవుతారా? వంటి ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. కమల్ తాజాగా వాటికి సమాధానం ఇచ్చారు.
తమిళనాడులో లోక్ నాయకుడు కమల్ హాసన్ పార్టీలో ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పెద్ద నాయకులంతా పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఈ పరిణామంతో కమల్ రాజకీయాలు వదిలి సినిమాల బాటపడుతారని జోరుగా ప్రచారం సాగింది.. అయితే తాజాగా రాజకీయ సన్యాసంపై కమల్ హాసన్ స్పష్టతనిచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతానని కమల్ తేల్చిచెప్పాడు. తాజాగా కమల్ హాసన్ ట్వీట్ చేశాడు. తన పార్టీ శ్రేణులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నించారు. ‘మక్కల్ నీది మయ్యం ’ పార్టీ నుంచి ఎంత మంది బయటకు వెళ్లినా తాను మాత్రం రాజకీయ పయనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడేది లేదని స్పష్టం చేశారు. కూటమి ఏర్పాటు సమయంలో నోరు మెదపని వారంతా ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని కమల్ విమర్శించారు.
వ్యాపార కోణంలో చూసే వారు మాత్రమే పార్టీని వెళ్లిపోతున్నారని.. అలాంటి వ్యాపారులు ఎంత మంది పార్టీని వీడినా.. తాను మాత్రం రాజకీయ పయనాన్ని కొనసాగిస్తానని కమల్ స్పష్టం చేశారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని.. మరింత ఉత్సాహంగా పనిచేద్దామన్నారు. బలం పెంచుకుందామని తెలిపారు. పోయేవాళ్లంతా కలుపు మొక్కలే.. ఎంత మంది పోయినా ఇబ్బంది లేదు అంటూ ధీమాగా చెబుతున్నారు. రాబోయే ఐదేళ్లు పార్టీని కమల్ ఎలా కాపాడుకుంటారనేది పక్కన బెడితే, కమల్ తాజాగా వ్యాఖ్యలతో రాజకీయ సన్యాసం వార్తలకు మాత్రం చెక్ పడినట్లయింది.