iDreamPost
android-app
ios-app

క్లాసు మాసు జై కొట్టిన “కలిసుందాం రా” – Nostalgia

  • Published Jan 16, 2020 | 10:22 AM Updated Updated Jan 16, 2020 | 10:22 AM
క్లాసు మాసు జై కొట్టిన “కలిసుందాం రా” – Nostalgia

మాములుగా ఇండస్ట్రీ రికార్డులు సృష్టించడం బద్దలు కొట్టడం మాస్ సినిమాల వల్లే అవుతుందన్నది ఎక్కువ శాతం ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం. చరిత్ర కూడా అదే రుజువు చేస్తూ వచ్చింది. అడవి రాముడు, ఘరానా మొగుడు, పెదరాయుడు,. చంటి, సమరసింహారెడ్డి లాంటివన్నీ మాస్ కంటెంట్ ఉన్నవే. కానీ అలా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి అందరిని మెప్పించేలా సినిమా తీయొచ్చని రుజువు చేయడమే కాక రికార్డుల తుఫాను రేపిన కలిసుందాం రా 20వ సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా ఆ ఏడాది జనవరి 14న విడుదలైన ఈ చిత్రం వెంకీ ఫ్యాన్స్ కే కాదు ప్రతి సినిమా ప్రేమికుడికి ఓ తీయని జ్ఞాపకం

అతని పేరు ఉదయ్ శంకర్. అప్పటికి తమిళ్ లో పుడుచవా అనే సినిమా తీశాడు. పెద్దగా ఆడలేదు. తెలుగులోకి పెళ్లికళ వచ్చేసిందే బాలా అని డబ్బింగ్ చేస్తే ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి దర్శకుడు ఓ ఫ్యామిలీ స్టోరీతో సురేష్ సంస్థ అధినేత రామానాయుడు గారిని కలిశాడు. అనుభవం ఒక్క సినిమానే అయినప్పటికీ అతని కథలోని దమ్ము నాయుడుగారితో పాటు సురేష్ గారికి అర్థమైపోయింది. రచనా దిగ్గజాలు పరుచూరి బ్రదర్స్ రంగంలోకి దిగారు. మొత్తం స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. బడ్జెట్ పరంగా రాజీ పడకూడదని ముందే డిసైడ్ అయ్యారు.

ఓ పెళ్లి సందర్భంగా ఏర్పడిన మనస్పర్థలు రెండు కుటుంబాల మధ్య అగాధాన్ని సృష్టిస్తాయి. దీంతో హీరో పుట్టకముందే బామ్మా తాతయ్యల కు దూరంగా ఎక్కడో ముంబైలో పెరుగుతాడు. పాతికేళ్ల తర్వాత ఓ వేడుక సందర్భంగా వాళ్ళను ఊరికి రావాల్సిందిగా ఆహ్వానం వస్తుంది. హీరో తల్లి చెల్లితో సహా అక్కడికి చేరుకుంటాడు. ఇక అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది బద్ధ శత్రువులుగా భావించే వైరి కుటుంబంతో ఎలాంటి బంధం ఏర్పడింది అనేది తెరమీద చూడాలి.

నిజానికి కలిసుందాం రా మరీ గొప్ప కథేమీ లేదు. అద్భుతమంతా ట్రీట్మెంట్ లో ఉంది. ఎక్కడ ఎమోషన్ పండాలి, ఎక్కడ కామెడీ ఉండాలి, ఎలాంటి పాటలు కావాలి అనేవి కొలిచి మరీ తూచినట్టుగా పర్ఫెక్ట్ గా రాసుకోవడంతో అంతే అందంగా తెరపైకి వచ్చింది. హీరో ఊరికి వచ్చాక చాలా సేపు మరదలితో సరదాలు, పిల్లలతో అల్లరి ఇలా గడిచిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఎమోషన్స్ రంగప్రవేశం చేస్తాయి. తాత మనవళ్ల మధ్య అనుబంధం గొప్పగా పండింది. తెరనిండా ఆర్టిస్టులతో ప్రతి ఫ్రేమ్ మంచి విందు భోజనంలా ఉంటుంది. దానికి తోడు ఎస్ఏ రాజ్ కుమార్ వీనులవిందైన సంగీతం హుషారు గొలిపే ఏడు పాటలు ఎక్కడా విసుగు రాకుండా అప్పుడే అయిపోయిందా అని అనిపించేలా చేస్తాయి. పరుచూరి సంభాషణలు సినిమాని కొత్త ఎత్తుకు తీసుకెళ్లాయి. ఇంకేముంది ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు . దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలు

* 2000వ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కలిసుందాం రా చరిత్ర సృష్టించడమే కాదు అప్పటిదాకా సమరసింహారెడ్డి పేరు మీద రికార్డులను చెరిపేసింది

* సరిగ్గా వారం ముందు మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య రిలీజై దానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలిసుందాం రా ధాటికి వసూళ్లు తగ్గించుకుని సర్దుకోవాల్సి వచ్చింది

* సంక్రాంతి రేస్ లో బాలకృష్ణ వంశోద్ధారకుడు ఉన్నప్పటికీ దాని ప్రభావం ఏ మాత్రం పడలేదు

* విపరీతమైన అంచనాల మధ్య దాసరి సమ్మక్క సారక్క కూడా అదే సమయంలో వచ్చింది. అయినా కూడా కలిసుందాం రా ముందు వెలవెలబోయింది

* అదే ఏడాది కలిసుందాం రా స్థాయిలో నువ్వే కావాలి లాంటి సినిమాలు రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ దీని రికార్డులు మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి

* కేవలం 20, 30 రూపాయల టికెట్ ధరల టైంలోనే 27 కోట్ల షేర్ రాబట్టింది కలిసుందాం రా. ఇప్పటిలెక్కల్లో ఎన్ని వందల కోట్లో చెప్పడం కష్టం

* 103 కేంద్రాల్లో శతదినోత్సవం, 35 కేంద్రాల్లో నూటా డెబ్భై ఐదు రోజులు, 20 కేంద్రాల్లో ద్విశతదినోత్సవం జరుపుకుని ట్రేడ్ తో ఔరా అనిపించుకుంది

* ఈ సినిమా దెబ్బకు హీరోయిన్ సిమ్రాన్ టాప్ రేంజ్ కు వెళ్లిపోగా, కె విశ్వనాధ్ గారు నటుడిగా చాలా బిజీగా అయిపోయారు. నటించిన ప్రతి ఒక్కరికి చాలా పేరు తీసుకొచ్చింది

* వచ్చింది పాలపిట్ట అనే పాటలో స్వర్గీయ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ ద్వారా డాన్స్ మూమెంట్స్ లో చూపించడం మాములు కిక్ ఇవ్వలేదు. ఆ క్షణాలన్నీ ధియేటర్లు దద్దరిల్లిపోయాయి

* సుమారు 50 రోజులకు పైగా ధియేటర్ యజమానులు హౌస్ ఫుల్ బోర్డులు పక్కకు పెట్టలేని పరిస్థితి. కుటుంబ సినిమాకు టికెట్ల కోసం ఇంత రద్దీని ఆ మధ్యకాలంలో ఎవరూ చూడలేదు

* శ్రీహరి పాత్ర, సందర్భానుసారంగా వచ్చే ఫైట్లు, పాటల్లో హుషారైన వెంకీ సిమ్రాన్ ల స్టెప్పులు మాస్ ప్రేక్షకులు కోరుకున్నవి ఇచ్చేశాయి

* ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఆయన్ను మరింత బిజీ డైరెక్టర్ గా మార్చేసింది.

* కలిసుందాం రా తర్వాత మరో అవకాశాన్ని వెంకటేష్ ప్రేమతో రా రూపంలో ఉదయ్ శంకర్ కు ఇస్తే దాని ఫలితం తీవ్రంగా నిరాశపరిచింది

* దీని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ కలిసుందాం రాను అధిగమించే స్థాయిలో మరో చిత్రం తీయలేకపోయారు.

* అప్పటిదాకా 70 ఏళ్ళ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్ని కలిసుందాం రా పేరు మీద వచ్చేశాయి. ఒక్క ఏడాది గ్యాప్ లోనే నరసింహనాయుడు వాటికి తుడిచేసింది కాని ఇప్పటికి కొన్ని పదిలంగానే ఉన్నాయి.

అందుకే కలిసుందాం రా చాలా స్పెషల్ మూవీగా ఇప్పటికీ సినిమా ప్రేమికులు భావిస్తారు. ఎమోషన్ల పేరుతో బకెట్లకు బకెట్లు కన్నీళ్ళు కార్పిస్తూ గంటల తరబడి క్లాసులు పీకడమే ఫ్యామిలీ మూవీగా భావించే కొందరు ఇప్పటితరం దర్శకులకు కలిసుందాం రా ఒక మంచి రిఫరెన్స్ అని చెప్పొచ్చు