iDreamPost
android-app
ios-app

కళాపురం రిపోర్ట్

  • Published Aug 26, 2022 | 4:55 PM Updated Updated Aug 26, 2022 | 4:55 PM
కళాపురం రిపోర్ట్

నిన్నంతా లైగర్ హడావిడితోనే గడిచిపోవడంతో కొన్ని చిన్న సినిమాలు ఇవాళ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. అందులో కళాపురం ఒకటి. పలాసతో విమర్శకులను మెప్పించిన దర్శకుడు కరుణ కుమార్ ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ రూపంలో ద్వితీయ విఘ్నం ఎదురుకున్నాడు. అంచనాలు అందుకోలేకపోయినా ఆయనలో టెక్నీషియన్ కు మంచి మార్కులే పడ్డాయి. ఆ మధ్య ఆహా కోసం మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ చేశారు కానీ అది పర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు మరో మూవీతో వచ్చారు అదే కళాపురం. పెద్దగా హడావిడి లేకుండా చిన్న ఆర్టిస్టులతో గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకున్న ఈ ఎంటర్ టైనర్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

దర్శకుడిగా స్థిరపడాలనే లక్ష్యంతో ఉంటాడు రాజేష్ కుమార్(సత్యం రాజేష్). సంవత్సరాలు గడిచిపోతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. హీరోయిన్ కావాలని ట్రయిల్స్ లో ఉన్న ప్రియురాలు మోసం చేయడంతో చిరాకొచ్చి తిరిగి ఊరెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. సరిగ్గా అదే టైంలో కోటి రూపాయల్లో సినిమా తీసిపెట్టమని ఒక నిర్మాత అడుగుతాడు. అయితే మొత్తం తన స్వగ్రామం కళాపురంలోనే తీయాలని కండీషన్ పెడతాడు. రాజేష్ కళాపురం వెళ్ళాక ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. ఆ కోటికి చిక్కులు ఏర్పడతాయి. అతను చివరికి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా లేదా అనేదే తెరమీద చూడాలి.

సినిమాకు తక్కువ షార్ట్ ఫిలింకు ఎక్కువ లాంటి పాయింట్ తీసుకున్న కరుణ కుమార్ విపరీతమైన బడ్జెట్ పరిమితులతో పాటు సాలిడ్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే కంటెంట్ రాసుకోలేక తడబడి ఫైనల్ గా బిలో యావరేజ్ అవుట్ ఫుట్ ఇచ్చేశారు. చాలా సీన్లు సిల్లీగా ఉన్నాయి. సినిమా బండి, జాతిరత్నాలు ఫార్మాట్ లో ఏదో నవ్వించే ప్రయత్నం చేశారు కానీ అవేవి పండలేదు. చివరిలో ఇచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటే వెరైటీగా ఉన్నప్పటికీ మిగిలినదంతా అనవసరమైన ప్రహసనంగా సాగిపోయింది. థియేటర్లకు స్టార్ వేల్యూ, స్ట్రాంగ్ కంటెంట్ ఉంటేనే జనం వస్తున్న తరుణంలో ఇలాంటి వాటితో ఆడియన్స్ ని మెప్పించడం కష్టమే. మణిశర్మ సంగీతం సైతం పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఓటిటికి రైట్ ఛాయస్ అనిపించే ఇలాంటి మూవీస్ ఇంత పోటీ మధ్య నిలవడం అనుమానమే.