iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు కాకుమానికి కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరి

ఎట్టకేలకు కాకుమానికి కార్పొరేషన్‌ చైర్మన్‌ గిరి

చట్టసభల్లో అడుగుపెట్టాలని, ప్రజా జీవితం గడపాలనే ఆకాంక్షలు రాజకీయ నేతలకు ఉండడం సహజం. ఆయా పార్టీలలో ఏళ్ల తరబడి పని చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. కొంత మందికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది.  కొంత మందికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది. ఈ కోవకే చెందుతారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుమాని రాజశేఖర్‌. ఏళ్ల తరబడి రాజకీయ ఉన్నతి కోసం ఎదురు చూస్తూ నిబద్ధతతో పని చేస్తున్న వారి ఆంకాక్షలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 135 నామినేటెడ్‌ పోస్టులను ఒకేసారి భర్తీ చేయడం ద్వారా నెరవేర్చారు.

తాజాగా ప్రకటించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు, ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కని వారు ఉన్నారు. దాదాపు మూడున్నర దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉంటూ.. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కాకుమాని రాజశేఖర్‌ను రాష్ట్ర లెథర్‌ ఇండస్ట్రీ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నియమించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న కాకుమాని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్నేహితుడు. శర్మ కాలేజీలో స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ.. ఆ తర్వాత యూత్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మూడున్నర దశాబ్ధాల తర్వాత కాకుమాని రాజశేఖర్‌కు ఉన్నత పదవి దక్కింది.

కమ్యూనిస్టు భావాలు గల కాకుమాని కాలేజీ రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఐలో చురుకుగా పని చేశారు. ఒంగోలు శర్మ కాలేజీ ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాకుమాని.. ఆ పార్టీ ఒంగోలు టౌన్‌ అధ్యక్షుడుగా, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రెసిడెంట్‌గా, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌గా, పీసీసీ కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశారు. మంత్రి బాలినేని వెంట నడిచిన కాకుమాని.. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. ఐదేళ్ల నుంచి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ వాయిస్‌ను వివిధ వేదికలపై బలంగా వినిపిస్తున్నారు.

Also Read : పని తీరుకు పట్టం.. నవీన్ నిశ్చల్‌కు ఆగ్రోస్ చైర్మన్ పదవి

కౌన్సిలర్‌గా ప్రజా జీవితం మొదలు..

కాకుమాని ప్రజా జీవితం కౌన్సిలర్‌గా మొదలైంది. 1985లో ఒంగోలు మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ఆయన ఎన్నికయ్యారు. ఆ తర్వాత పార్టీ పరమైన పదవులు సమర్థవంతగా నిర్వర్తిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2004లో జనరల్‌ ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం తృటిలో కోల్పోయారు. అనేక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ టిక్కెట్‌ దారా సాంబయ్యకు దక్కింది. 2009లో యర్రగొండపాలెం టిక్కెట్‌ కూడా దక్కినట్లే దక్కి చేజారింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు.

2004లో సంతనూతలపాడు టిక్కెట్‌ చేజారిన కాకుమాని రాజశేఖర్‌కు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో జిల్లా ఒలంపిక్‌ కమిటీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఫుట్‌బాల్‌లో జాతీయ క్రీడాకారుడైన కాకుమాని ఒలంపిక్‌ కమిటీ జిల్లా అధ్యక్షుడుగా సమర్థవంతంగా పని చేశారు. కాలేజీ రోజుల్లో రాష్ట్రం తరఫున సంతోష్‌ ట్రోఫిలో ఆడారు. యూనివర్సిటీ స్థాయి ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించారు.

మూడున్నర దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉంటూ.. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం కోల్పోయిన కాకుమానికి జగన్‌ సర్కార్‌లో రాష్ట్ర స్థాయి పదవి దక్కడంతో ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్న కాకుమానికి వైఎస్‌ జగన్‌ తన గుర్తింపు ఇచ్చారని కొనియాడుతున్నారు.

Also Read : రాజన్న దళం చిరంజీవి రెడ్డికి ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ పదవి ఎలా దక్కింది..?