iDreamPost
iDreamPost
కాకినాడ కార్పొరేషన్ లో తనపై కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై అభ్యంతరాలు తెలియజేస్తూ మేయర్ సుంకర పావని వేసిన కేసు ఈ నెల 22వ తేదీకి వాయిదా పడింది. తనపై అవిశ్వాస తీర్మానంపై కార్పొరేటర్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి మేయర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి శుక్రవారం హైకోర్టులో ఇరువర్గాల వాదనలు విన్నారు. మేయర్ న్యాయవాదులతోపాటు, ప్రభుత్వ న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం కేసును 22వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.
5న సమావేశం యథాతథం..
పార్టీలకు అతీతంగా 33 మంది కార్పోరేటర్లు కలెక్టర్ ను కలసి మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలో కలెక్టరు ఈనెల 5వ తేదీన అవిశ్వాసం పై చర్చకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు ఓటింగ్ జరపాలని నిర్ణయించారు. ఇప్పుడు మేయర్ పావని పిటీషన్ పై కోర్టు కేసును వాయిదా వేసినందున 5వ తేదీన సమావేశం యథాతథంగా జరుగుతుందని అంటున్నారు. సమావేశం నిలుపు చేయమని కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వనందున అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందటానికి ఏ ఆటంకం లేదని కార్పొరేటర్లు అంటున్నారు. మేయర్ తో పాటు డిప్యూటీ మేయర్ -1 కాలా సత్తిబాబుపై కూడా అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నట్టు కార్పొరేటర్లు చెబుతున్నారు.
ఇవీ సమీకరణలు..
ముగ్గురు మృతి చెందడం, ఒకరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 44 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మూడు ఎక్ష్ అఫీషీయో ఓట్లు ఉన్నాయి. దీంతో మొత్తం ఓట్లు 47 అవుతాయి. సభ కోరం పూర్తి కావాలంటే 31 మంది సభ్యులు హాజరు కావాలి. హాజరైన వారిలో సగం కన్న ఒక్క ఓటు ఎక్కువగా అవిశ్వాసానికి మద్దతుగా వస్తే మేయర్ పదవిని కోల్పోతారు.
Also Read : కాకినాడ మేయర్ పై అవిశ్వాసానికి ముహూర్తం ఖరారు