iDreamPost
android-app
ios-app

Telangana MLC – కడియం శ్రీహరి,మధుసూదనా చారిల ఎమ్మెల్సీ కలిసొచ్చిన ఈక్వేషన్స్

Telangana MLC – కడియం శ్రీహరి,మధుసూదనా చారిల ఎమ్మెల్సీ కలిసొచ్చిన ఈక్వేషన్స్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందడి కాస్త హడావిడి గా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తూనే, తనను నమ్ముకున్న వాళ్లకు అలాగే తాను నమ్మిన వాళ్లకు న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. రాజకీయంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సీనియర్ల విషయంలో సీఎం కేసీఆర్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని కొంతమందిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇద్దరి విషయంలో తీసుకున్న నిర్ణయం కొంతమంది ని సంతృప్తి పరుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి అదేవిధంగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విషయంలో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. 2014లో తొలిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరికి బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ తెలంగాణ తొలి స్పీకర్ గా మధుసూదనాచారి అవకాశం ఇచ్చారు. అయితే 2018 తర్వాత వీరిద్దరూ శాసనసభలో లేకపోవడంతో సీఎం కేసీఆర్ వాళ్లకు ఏ విధంగా న్యాయం చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చలు జరిగాయి.

2014కు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన కడియం శ్రీహరి ప్రభుత్వం సీఎం కేసీఆర్ కు తలలో నాలుకలా వ్యవహరించారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఆయనకు బలమైన వర్గంగా ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా కడియం శ్రీహరి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా జిల్లాలో ఆయన విషయంలో అసంతృప్తి ఉన్న నాయకులతో కొంత మంది సీనియర్లను మాట్లాడించారు. ఇక 2018 తర్వాత ఆయనను ఎమ్మెల్సీగా మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగినా అది నిజం కాదని తెలిసింది.అయితే ఇప్పుడు కడియం శ్రీహరిని సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా మండలికి పంపించడానికి సిద్ధం కావడంతో ఆయన వర్గం సంతోషంగా ఉంది. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఆయనకు కచ్చితంగా చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

ఇక మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విషయంలో సీఎం కేసీఆర్ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. 1982లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన మధుసూదనాచారి ఆ తర్వాత సీఎం కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. 1994 తర్వాత తెలుగుదేశం పార్టీలో విభేదాలు వచ్చినా సరే ఆయన అధికారం కోసం చంద్రబాబుని నమ్మకుండా సొంతగా ఎదిగే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో చంద్రబాబు పక్షాన నిలబడిన ఆయన మాత్రం చంద్రబాబుతో కలిసి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఏ దశలో కూడా తన రాజకీయ భవిష్యత్తు విషయంలో మధుసూదనాచారి ఆందోళనకు గురి కాలేదు. ఎన్టీఆర్ తర్వాత కెసిఆర్ సామర్ధ్యాన్ని ఆయన ఎక్కు నమ్మా,రు.

కేవలం రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యే అయినా సరే టిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ మధుసూధనాచారి సీఎం కేసీఆర్ కు అన్ని విధాలా సహకరిస్తూ వచ్చారు. ఒకసారి లక్ష్మీపార్వతికి మరోసారి హరికృష్ణకు మద్దతిచ్చిన మధుసూధనాచారి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాలని కొంతమంది సీనియర్ల ఒత్తిడి చేసినా సరే ఆఫర్లను తిరస్కరించారు. ప్రస్తుతం ఆయన భూపాలపల్లి నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ కీలక నేతగా ఉండగా సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో కేబినెట్ లోకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.

2014లోనే మధుసూదనాచారి కి కేబినెట్ బెర్త్ ఖరారు అయినట్లు ప్రచారం జరిగినా సరే సీఎం కేసీఆర్ మాత్రం స్పీకర్ గా ఎంపిక చేయడంతో సభాపతి స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు శాసనమండలికి వెళ్లడంతో కచ్చితంగా ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వీరితో పాటుగా నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి ,అలాగే కోటిరెడ్డి ,ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పాడి కౌశిక్ రెడ్డి ,అలాగే రవీందర్రావు లకు ఎమ్మెల్సీ సీట్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు.