Idream media
Idream media
కరనా వైరస్ చైనా కుట్ర అని ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. అమెరికాను దెబ్బతీయడానికే కరోనాను చైనాను రూపొందించిందని కేఏ పాల్ చెప్పారు. ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు అమెరికా నుంచి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఏ పాల్ పై విధంగా సంచలన ఆరోపణలు చేశారు.
అగ్రరాజ్యం కావాలనే లక్ష్యంతోనే చైనా కరోనా వైరస్‌ను తయారు చేసిందని పాల్ పేర్కొన్నారు. మానవ హక్కులు లేని తన దేశంలో ఆ వైరస్‌ను ప్రవేశపెట్టి ఆ తర్వాత ప్రపంచానికి విస్తరించిందని ఆయన ఆరోపించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు చైనా కుట్ర పన్నిందన్నారు. ఇతర దేశాలకు పాకుతుందని తెలిసి కూడా కరోనా వైరస్‌ను బయటకు వదిలిందన్నారు.
చైనాలో మానవ హక్కులు ఏ మాత్రం ఉండవని పాల్ చెప్పారు. తాను తరచూ ఆ దేశానికి వెళతానని, ఆ ప్రభుత్వానికి నచ్చకపోతే తన సందేశం ప్రచారం కాకుండా నిలిపివేస్తుందన్నారు. కనీస మానవ హక్కులు లేని దేశంలో ప్రజలు చనిపోయినా లెక్కలేదన్నారు. హూహాన్ సిటీ వరకే కరోనా వ్యాపించడం చైనా కుట్ర అని పాల్ ఆరోపించారు.
ప్రపంచ శాంతి కోసం తాను 200 దేశాలు తిరిగానని పాల్ చెప్పారు. తాను శాంతి అంటుంటే.. అమెరికా యుద్ధం అంటోందన్నారు. ట్రంప్ గెలుపు కోసం తాను పని చేశానని ఆయన అనుచరులే చెప్పారని, ఆ తర్వాత ట్రంప్ యుద్ధం కోరుకుంటుండడంతో ఆయనను తాను వ్యతిరేకించానన్నారు. కరోనా వైరస్ త్వరగా నశించాలని తాను ప్రార్థన చేస్తానన్నారు. అందరూ బాగుండాలని పాల్ ఆకాంక్షించారు.