Idream media
Idream media
ప్రతి 30 ఏళ్లకు తరం మారుతుందంటారు. అది అనేక సందర్భాల్లో రుజువైంది. రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడం సర్వసాధారణం. వారసత్వం అందినా.. విజయవంతమవుతారా..? లేదా..? అనేది వారసుల సత్తాపై ఆధారపడి ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే, మూడు దశాబ్ధాలుగా రాజకీయ అనుభవం, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ రాజకీయ వారసుడుగా ఆయన కుమారుడు జ్యోతుల నవీన్ తెరపైకి వస్తున్నారు. 2024లో జగ్గంపేట నుంచి పోటీ చేసే లక్ష్యంతో నవీన్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు.
అనారోగ్యం వల్ల ఎంట్రీ..
40వ పడిలో ఉన్న జ్యోతుల నవీన్ పోటీ చేస్తారని కొన్నేళ్తుగా ప్రచారంలో ఉన్నా.. అది 2024లో వాస్తవరూపంలోకి రాబోతోంది. ఇందుకు ఆయన తండ్రి జ్యోతుల నెహ్రూ అనారోగ్యమే కారణం. ఇటీవల నెహ్రూ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాపాయం తప్పింది. స్టంట్ వేశారు. ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం నెహ్రూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొన్నాళ్లుగా నెహ్రూకు ఆరోగ్యం సహకరించడం లేదు. 70వ పడికి దగ్గరపడుతున్న నెహ్రూ కొద్దిదూరం నడిస్తే తీవ్రంగా అలసిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కుమారుడును రంగంలోకి దించాలనుకుంటున్నారు.
ఆ అనుభవం పనికొస్తుందా..?
నవీన్ తండ్రి నుంచి ఓనమాలు దిద్దారు. చిరంజీవి వీరాభిమాని అయిన నవీన్ ప్రోద్భలంతోనే టీడీపీలో ఉన్న నెహ్రూ పీఆర్‌పీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2009లో జగ్గంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు 1994, 1999లో టీడీపీ తరఫున గెలిచారు. 2017లో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. మంత్రి పదవి వస్తుందని ఆశిస్తే.. కుమారుడు నవీన్‌కు జడ్పీ చైర్మన్ పీఠంతో సరిపెట్టుకున్నారు. రెండున్నరేళ్లు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా నవీన్ పని చేశారు. ఆ అనుభవం ఆయనకు ప్రస్తుతం ఉపయోగపడుతోంది. రాబోయే ఎన్నికల్లో నవీన్ టీడీపీ తరఫున పోటీ చేయడం దాదాపు ఖాయమే. ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ జిల్లా అ«ధ్యక్షుడుగా ఉన్న నవీన్.. యాక్టివ్‌గా రాజకీయాలు చేస్తున్నారు. మరి తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తారా..? లేదా..? చూడాలి.
చంటిబాబు తొలిసారి ఎమ్మెల్యే…
ప్రస్తుతం జగ్గంపేట ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంటిబాబు వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. జ్యోతుల నెహ్రూ పీఆర్‌పీలో చేరడంతో 2009లో తొలిసారి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం చంటిబాబుకు లభించింది. త్రిముఖ పోరులో మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తోట నరసింహం 789 ఓట్ల స్వల్ప మెజారిటీతో పీఆర్‌పీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై గెలిచారు. 2014లోనూ రెండోసారి టీడీపీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకున్న చంటిబాబుకు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే నెహ్రూ వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో చంటిబాబుకు కలిసొచ్చింది. నెహ్రూ టీడీపీలోకి రాగానే.. చంటిబాబు వైసీపీలో చేరి ఆ పార్టీ కో ఆర్డినేటర్ పదవి, 2019లో ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
Also Read : విజి”లెన్స్” : టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు !