iDreamPost
android-app
ios-app

అవినీతిపై జస్టిస్‌ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు

అవినీతిపై జస్టిస్‌ ఎన్‌వీ రమణ కీలక వ్యాఖ్యలు

సుప్రిం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అవినీతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి వల్ల ప్రజా స్వామ్యానికి, ఇతర వ్యవస్థలకు ఎలాంటి కీడు జరుగుతుందో ఆయన సవివరంగా చెప్పారు. ఏషియన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ కాన్ఫరెన్స్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్‌వీ రమణ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. అవినీతి, దాని వల్ల కలిగే నష్టంపై ఎన్‌వీ రమణ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

‘‘ ఎక్కడైతే అవినీతి సాధారణమైపోతుందో అక్కడ వ్యవస్థలపై ప్రజా విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అంతిమంగా ప్రజాస్వామ్య విలువలు వదులుకోవాల్సి వస్తుంది. అవినీతి.. ప్రజాస్వామ్యం, ప్రజా స్వామ్య వ్యవస్థల మూలాలను తినేస్తోంది. రాజ్యాంగం ఎంత బాగా ఉన్నప్పటికీ అమలు చేసే వారు మంచివారైతే లోపాలున్నప్పటికీ దండిగా మేలు జరుగుతుందని రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బి.ఆర్‌. ఆంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు.

భారత దేశంలో న్యాయం, చట్టం రెండూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. చట్టంలోని అంశాలతో విభేదించడం, దానికి భాస్యం చెప్పడం అన్నది నిరంతరంగా సాగుతూనే ఉంటుందని సుదీర్ఘకాలం న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పని చేసిన అనుభవంతో తెలుసుకున్నా. అయితే మన దేశ సుస్థిరత మాత్రం రాజ్యాంగం నిర్ధేశించిన న్యాయ సూత్రాలను అనుసరించి వివాదాలను విజయవంతంగా పరిష్కరించడంపైనే ఆధారపడి ఉంటుంది’’ అని జస్టిస్‌ ఎన్‌వీ రమణ వివరించారు. ఈ సదస్సులో అవినీతిపైనే గాక న్యాయం, చట్టం.. అవి ప్రజలకు అందుతున్న విధానం తదితర అంశాలపై కూడా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రసంగించారు.