Idream media
Idream media
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాల నేపథ్యంలో సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ఆసక్తిర పరిణామం చోటుచేసుకుంది. ఏబీపై ఏపీ ప్రభుత్వం వేసిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రిం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతోంది.
అయితే ఈ రోజు ఈ విచారణ నుంచి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకున్నారు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికి వచ్చింది. మరో ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వెళ్లాల్సిన పరిస్థితి జస్టిస్ లావు నాగేశ్వరరావు తప్పుకోవడం వల్ల ఏర్పడింది. దీపావళి తర్వాత మరో ధర్మాసనం ముందు ఈ పిటిషన్ విచారణకు వెళ్లనుంది. ఈ పరిణామం అటు సుప్రిం న్యాయవాదుల్లోనూ, ఇటు ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది.
చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక విమర్శలు, ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయి. ఆయన అధికారిగా కాకుండా టీడీపీ నాయకుడిగా పని చేశారని విమర్శలొచ్చాయి. ప్రభుత్వం నుంచి విలువైన కాంట్రక్టులు ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కంపెనీ దక్కాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం సేకరిస్తూ.. టీడీపీ అభ్యర్థులకు దిశానిర్ధేశం చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. వివాదాస్పదమైన అధికారిగా మారిన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంలో తాజాగా జరిగిన పరిణామం.. గత పరిస్థితుల దృష్ట్యా రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది.