iDreamPost
android-app
ios-app

జూలై 3 వారాల బాక్సాఫీస్ రిపోర్ట్

  • Published Jul 18, 2022 | 5:25 PM Updated Updated Jul 18, 2022 | 5:25 PM
జూలై 3 వారాల బాక్సాఫీస్ రిపోర్ట్

బాక్సాఫీసు నత్తనడకన వెళ్తోంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, మేజర్, విక్రమ్ ల తర్వాత మళ్ళీ ఆ స్థాయి సినిమా లేక జనాలు సినిమాల మీద అంత ఆసక్తి చూపించడం లేదు. మధ్యలో ఎఫ్3 లాంటివి మెరిపించినా అంతో ఇంతో అంచనాలున్న అంటే సుందరానికి లాంటివి నిరాశ పరచడంతో నడిసముద్రంలో ఊగుతున్న పడవలా అయిపోయింది పరిస్థితి. ఇక మొన్న శుక్రవారం విడుదలైన మూవీస్ సంగతికొస్తే సుమారు 40 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన రామ్ ది వారియర్ నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ని పూర్తిగా సద్వినియోగ పరుచుకోలేదు. టాక్ గట్టిగానే ప్రభావం చూపించింది. ఇప్పటిదాకా 17 కోట్లకు దగ్గరగా షేర్ వసూలైనట్టు ట్రేడ్ టాక్.

ఇంకా రావాల్సింది చాలా ఉంది. లాభాలు దేవుడెరుగు కనీసం భారీ నష్టం తప్పించుకోవడం కూడా కష్టమేనేలా ఉంది. ఇక పెద్దగా టార్గెట్ లేని గార్జికి ప్రశంసలు ఎన్ని వచ్చినా అవి వసూళ్లుగా మారలేదు. జనం దీన్ని థియేటర్ దాకా వెళ్లి చూసేందుకు ఇష్టపడటం లేదు. ఫలితంగా చాలా చోట్ల సింగల్ డిజిట్ ఆడియన్స్ తో పాటు నెగటివ్ షేర్లు నమోదయ్యాయి. ఒకవేళ డైరెక్ట్ ఓటిటిలో వచ్చి ఉంటే జైభీం తరహాలో గొప్ప పేరు వచ్చేది కానీ హాళ్లలో రావడం వల్ల ప్రయోజనం దక్కలేదు. సాయిపల్లవి కష్టం మరోసారి వృధా అయ్యింది. ఇక ప్రభుదేవా మై డియర్ భూతం గురించి అడిగేవాళ్ళు లేరు. మెజారిటీ సెంటర్లలో ఇవాళ్టి నుంచి షోలు రద్దు చేశారు.

ఎప్పుడో వచ్చిన మేజర్, విక్రమ్ లే ఇంకా ఫీడింగ్ కు వాడుకుంటున్నారు. పక్కా కమర్షియల్ ఆల్రెడీ ఫ్లాప్ గా డిక్లేర్ అయినప్పటికీ ఎంతో కొంత రాకపోదా అనే ఆశలు పెద్దగా నెరవేరడం లేదు. హ్యాపీ బర్త్ డే పూర్తిగా వాష్ అవుట్ అయ్యింది. పట్టుమని వారం కూడా ఆడలేక 7 కోట్ల దాకా నష్టాలు మిగిల్చి మైత్రికి మరో షాక్ ఇచ్చింది. నానాటికి తగ్గిపోతున్న ఆక్యుపెన్సీ పట్ల ఆందోళన చెందుతున్న ఇండస్ట్రీ పెద్దలు మెల్లగా చర్యలు తీసుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి రాబోయే రెండు వారాల్లో థాంక్ యు, రామారావు ఆన్ డ్యూటీ, విక్రాంత్ రోనాలు ఏ మేరకు మేజిక్ చేస్తాయో వేచి చూడాలి. లేదంటే జూలై మొత్తం డ్రైగా గడిచిపోయినట్టే