iDreamPost
android-app
ios-app

జడ్జినే హత్య చేసిన ధన్‌బాద్‌ మాఫియా గ్యాంగ్

జడ్జినే హత్య చేసిన ధన్‌బాద్‌ మాఫియా గ్యాంగ్

ధన్‌బాద్‌ ప్రాంతంలోని గ్యాంగ్ వార్ కథ ఆధారంగా తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ 1 & 2 సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ ప్రాంతంలోని మాఫియా గ్యాంగ్‌లు ఏ స్థాయికి తెగిస్తాయో ఈ రోజు జరిగిన జడ్జి హత్యను చూస్తే అర్ధమవుతుంది.

జార్ఖండ్ రాష్ట్రంలో న్యాయం చెప్పే న్యాయమూర్తి ప్రాణాలకే రక్షణ కరువైంది.ఓ న్యాయమూర్తిని నడిరోడ్డుమీద అత్యంత దారుణంగా హత్య చేశారు. సోషల్‌మీడియాలో అదనపు జడ్జి హత్యకు సంబంధించిన వీడియో జార్ఖండ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

ధన్‌బాద్‌ జిల్లా అడిషినల్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం ఉదయం మేయిన్‌ రోడ్డుపై వాకింగ్‌ చేస్తుండగా వెనక నుంచి వచ్చిన ఓ గుర్తు తెలియని ఆటో ఢీకొట్టింది.గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్న అడిషినల్‌,సెషన్స్‌ జడ్జి ఆనంద్‌ని ఓ వ్యక్తి ఆసుపత్రికి తరలించారు.అక్కడ ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టవశాత్తు కొన్ని గంటలపాటు మరణించిన వ్యక్తి అదనపు న్యాయమూర్తి ఉత్తమ్‌ ఆనంద్‌ అని ఆసుపత్రిలో ఎవరూ గుర్తించలేదు. 

మరోవైపు ఆయన కనిపించడం లేదని బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ఆటో ఢీకొనడంతో గాయపడి ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి జడ్జి ఉత్తమ్ ఆనంద్ అని గుర్తించారు.

ఈ దుర్ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది.అది ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగానే ఆటోతో జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను ఢీకొట్టినట్లు స్పష్టమైంది.దీంతో పోలీసులు న్యాయమూర్తిది హత్యగా తేల్చారు. హత్యకు ఉపయోగించిన ఆటోని అంతకుముందు కొన్ని గంటల క్రితమే దుండగులు దొంగలించడం పోలీసుల మతి పోగొట్టింది.ఈ దొంగలించిన ఆటోతోనే న్యాయమూర్తి ప్రాణాలు తీసినట్లు పోలీసులు నిర్ధారించారు.

నిందితులను గుర్తించేందుకు పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రధానంగా జడ్జి ఉత్తమ్ ఆనంద్ విచారణ జరుపుతున్న కేసులపై దృష్టి పెట్టారు. ఆయన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు బెయిలు ఇచ్చేందుకు ఇటీవలే నిరాకరించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆ కోణంలో దర్యాప్తుని ముమ్మరం చేశారు.ఇక ఆయన పలు హత్యలకి సంబంధించిన కేసులను విచారిస్తున్నారు.ఈ అంశం మీద కూడా పోలీసులు దృష్టిసారించారు. జడ్జి హత్య కేసుని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.

ఇది ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుంది.