iDreamPost
android-app
ios-app

కుప్పంలో జూ.ఎన్టీఆర్ జెండా : చంద్ర‌బాబుకు చెల్లు చీటీ ఇచ్చిన‌ట్లేనా?

కుప్పంలో జూ.ఎన్టీఆర్ జెండా : చంద్ర‌బాబుకు చెల్లు చీటీ ఇచ్చిన‌ట్లేనా?

తెలుగుదేశం పార్టీ నాయ‌క‌త్వ మార్పు కోరుకుంటోంద‌ని కొంత కాలంగా చ‌ర్చ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. సాక్షాత్తూ చంద్ర‌బాబునాయుడు కుప్పం ప‌ర్య‌ట‌న‌లోనే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ ప‌లువురు నిన‌దించారు. దీంతో బాబు ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యారు. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బుచ్చయ్య చౌద‌రి కూడా ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ, త్వ‌ర‌లో తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చోటుచేసుకుంటాయ‌ని, కొత్త నాయ‌క‌త్వం రాబోతుంద‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఏకంగా చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఏకంగా ఆయ‌న ఫ్యాన్స్ నూతన జెండా తయారు చేసి ఆవిష్కరించారు.

కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జనవరి చంద్రబాబు పర్యటించనప్పుడు ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ త్వరగా రావాలని ఫ్యాన్ కోరుకుంటున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ మాస్ హీరో. అంతేకాదు రాజకీయ పార్టీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. తాత ఎన్టీఆర్ పోలికలతో ఉండటం విశేషం. ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకునే తత్వం ఉన్నవాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు. గతంలోనూ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలా పని చేస్తానని, ఎప్పుడు తన అవసరం వస్తే అప్పుడు సేవలందిస్తానని గతంలో జూనియర్ ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీకి జూనియ‌ర్ అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయంటే, సీనియ‌ర్ అవ‌స‌రం లేద‌ని కోరుకుంటున్న‌ట్లేన‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఓ వైపు చంద్ర‌బాబు ఏమో.. 2024లో అధికారం త‌మ‌దేన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. మ‌రోవైపు జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీలోని కొంద‌రు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎన్టీఆర్ రావాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ ప‌రిణామాల‌న్నీ చంద్ర‌బాబుకు, త‌న‌యుడు లోకేశ్‌బాబు కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ జూనియ‌ర్ రాక‌పై విన‌తులు, డిమాండ్లకే ప‌రిమిత‌మైన చ‌ర్య‌లు ఇప్పుడు జెండా ఆవిష్క‌ర‌ణ‌కు దారి తీశాయి. మ‌రి దీనిపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.