iDreamPost
iDreamPost
ప్రస్తుతం బ్రేక్ పడిన ఆర్ఆర్ఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎన్ని డేట్స్ ఇవ్వాలో తెలియదు కానీ మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే ప్రాజెక్ట్ మాత్రం అతి త్వరలో పట్టాలెక్కబోతోంది. దసరాకు ముహూర్తం ఫిక్స్ చేశారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా చెప్పలేకపోయినా లీకైన న్యూస్ చూస్తే నిప్పు లేనిదే పొగరాదు సామెత గుర్తుకు వస్తోంది. కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తో పాటు హారికా హాసిని సంస్థ నిర్మించబోయే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందట.
ఫైనల్ వర్షన్ కూడా లాక్ చేసినట్టుగా చెబుతున్నారు. హీరోయిన్ ఫైనల్ కాలేదు కానీ రష్మిక మందన్న లేదా పూజా హెగ్డే ఇద్దరిలో ఒకరు పక్కాగా ఉండొచ్చని వినికిడి. చాలా రోజుల క్రితమే దీనికి టైటిల్ గా ‘అయినను పోయిరావలె హస్తినకు’ అని ప్రచారంలోకి వచ్చింది. దీన్ని యూనిట్ ఖండించలేదు కూడా. మరో అప్ డేట్ ప్రకారం ఇది డిఫరెంట్ స్టైల్ లో సాగే పొలిటికల్ డ్రామానట. త్రివిక్రమ్ మొదటిసారి తనదైన శైలిలో వివాదాలు రాకుండా పవర్ ఫుల్ విసుర్లు చాలానే జోడించారట. అయితే తారక్ పాత్ర మాత్రం రాజకీయ నాయకుడిగా ఉండదట. వర్తమాన రాజకీయాలను టచ్ చేస్తూనే ఒకే ఒక్కడు తరహాలో పవర్ఫుల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దబోతున్నారు.
మరి జూనియర్ రోల్ ఏమై ఉంటుందనే సందేహాలకు మాత్రం ఇప్పుడే క్లారిటీ రాదు. తమన్ స్వరాలు సమకూర్చే ఈ చిత్రంలో క్యాస్టింగ్ కూడా భారీగానే ఉంటుందని టాక్. త్రివిక్రమ్ లాక్ డౌన్ టైంలో పూర్తిగా దీని మీదే దృష్టి పెట్టి మొత్తం పనులు పూర్తి చేసినట్టుగా తెలిసింది. అయితే విడుదల 2021 సమ్మర్ లో ఉంటుందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అదే సీజన్ లో ఆ మల్టీస్టారర్ వస్తే మాత్రం త్రివిక్రమ్ ఇయర్ ఎండింగ్ కి షిఫ్ట్ కాక తప్పదు. అదే జరిగితే ఒకే ఏడాదిలో జూనియర్ ఎన్టీఆర్ రెండు సినిమాలు చూసే ఛాన్స్ దక్కుతుంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత వచ్చిన లాంగ్ గ్యాప్ కు న్యాయం చేకూరుతుంది.