Idream media
Idream media
తెలంగాణ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఊపు మీదున్న బీజేపీ ఆందోళన కార్యక్రమాలతో వేడెక్కిస్తోంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టడం, పోలీసులు దీక్షను భగ్నం చేసి తలుపులు పగలగొట్టి మరీ బండిని అరెస్ట్ చేయడాన్ని కాషాయ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో ఆందోళనా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది.కోవిడ్ నేపథ్యంలో ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ర్యాలీ చేసి తీరతాం.. ఎవరు ఆపుతారో చూస్తాం..అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు చేరుకున్న జేపీ నడ్డాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. కానీ ర్యాలీ చేసి తీరతామని నడ్డాతో పాటు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు లక్ష్మణ్, రాజాసింగ్, విజయశాంతి వంటి నేతలు ప్రకటించడం ఆసక్తిగా మారింది. నడ్డా పర్యటన సందర్భంగా శంషాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించగా.. అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.
దీంతో జేపీ నడ్డాను కలిసి ర్యాలీకి వెళ్లొద్దని కోరేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాలీకి అనుమతి లేదని జేపీ నడ్డాకు విమానశ్రయంలోనే పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ.. ఆ పార్టీ ముఖ్య నేతలు క్యాండిల్ ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి.
Also Read : జైలుకు బండి సంజయ్
సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం ఉంది. అయితే.. చివరకు ర్యాలీ లేకుండానే నడ్డా నిరసనతో ముగించారు. సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. నడ్డాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్ ఇతర బీజేపీ నేతలు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని తరుణ్ ఛుగ్ డిమాండ్ చేశారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా క్యాండిల్ ర్యాలీ లేదని కిషన్ రెడ్డి తెలిపారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించాక నడ్డా తదితరులు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు.
కాగా.. బండి సంజయ్ అరెస్ట్ పట్ల లోక్‌సభ స్పీకర్ స్పందించారు. ఈ ఉదంతం పట్ల తనకు 48గంట్లలోగా పూర్తి రిపోర్ట్ పంపించాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలిచ్చారు. వీటికి అనుగుణంగా రాష్ట్ర సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది హోం శాఖ. విచారణలో ఎంపీ బండి సంజయ్ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు ఓం బిర్లా. సోమవారం బండి సంజయ్ రాసిన లేఖలో.. శాంతియుతంగా నిరసన చేస్తున్న తనను అక్రమంగానూ, అవమానకరంగానూ అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
Also Read : యూపీ ఎన్నికల్లో ఏనుగు కనిపించడం లేదు !