iDreamPost
iDreamPost
జర్నలిజం..ఒకప్పుడు అదో ఫ్యాషన్. సమాజంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఆ వృత్తిలో అడుగుపెట్టారు. అందుకు అనుగుణంగానే అనేక మందిని ప్రభావితం చేసేవారు. రాతలతో పాలనా రీతులు మార్చేసిన అనేక మంది పాత్రికేయుల చరిత్ర మన దగ్గర ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత్రికేయం పాలకులకు ఒత్తాసు పలకే పనిలో మునిగింది. అక్షరం ఆయుధమై రగిన చోట ఇప్పుడు అడుగులకు మడుగులొత్తుతోంది. చివరకు అక్షరాన్ని నమ్ముకున్న రాతగాళ్ల తలరాతలను దిగజార్చేలా చేస్తోంది. మీడియా వ్యాపారుల ఉచ్చులో నలిగిపోవాల్సిన దుస్థితికి చేర్చింది.
ఒకప్పుడు జర్నలిజం వాస్తవాలను వల్లించడం. సమాజ శ్రేయస్సుకి తోడ్పడడం. కానీ ఇప్పుడు అలా కాదు. యజమానులు చెప్పిన దానికి తలూపడం. వారి చెప్పిన పద్ధతిలో వార్తలు వండి వార్చడం. అందుకే జర్నలిజాన్ని నమ్ముకున్న వారి పై ఒత్తిడి పెరుగుతోంది. కాలంతో పరుగులు పెట్టగలిగితే సరేసరి కానీ ..ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ఆ వలయంలో చిక్కుకున్న జర్నలిస్ట్ సతమతం కావాల్సిందే. ఓవైపు పని ఒత్తిడి..రెండో వైపు కుటుంబం నుంచి కూడా. యజమానుల లక్ష్యాలు నెరవేర్చడం కోసం సమిధలవుతున్న జర్నలిస్టులెందరో ఉన్నారు. చిన్నవయసులోనే గుండెపోటు, బీపీ, షుగర్లతో సతమతమవుతున్నారు. చివరకు ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను ఒంటరి చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఏకంగా హుస్సేన్ సాగర్ లో దూకి ప్రాణాలు కోల్పోయారు. ఎంతటి కష్టం వస్తే అలాంటి దారుణానికి ఒడిగడతారన్నది ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. ఒకప్పుడు చేనేత కార్మికులు తర్వాత అన్నదాతలు ఇప్పుడు జర్నలిస్టులు కూడా అలాంటి స్థితిని ఎదుర్కోక తప్పదా అనే ప్రశ్న ఉదయిస్తోంది.. సంఖ్యరీత్యా తక్కువ కావడంతో మిగిలిన వర్గాల వారి మీద హైలెట్ కాకపోవచ్చు గానీ వరుసగా పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్న తీరు ఆందోళనకరంగా మారుతోంది. వాస్తవానికి ప్రభాకర్ కి రెండున్నర దశాబ్దాల పాత్రికేయ చరిత్ర ఉంది. తొలుత ప్రింట్ మీడియాలో చేయి తిరిగిన సబ్ ఎడిటర్ గా ఆయనకు గుర్తింపు దక్కింది. అదే పరంపరలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నో సెటైరికల్ కార్యక్రమాలకు ఆయన నాంది పలికారు.
ఐ న్యూస్ తొలినాళ్లలో పిన్ కౌంటర్ ప్రోగ్రాం పెద్ద సంచలనం. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఆ కార్యక్రమానికి రూపకర్త ప్రభాకర్. ఆ తర్వాత మామామియా అంటూ ఎన్టీవీలోనూ దానిని కొనసాగించారు. మిగిలిన చానెళ్లన్నీ అలాంటి కార్యక్రమాలను చేపట్టక తప్పని స్థితి కల్పించారు. ప్రస్తుతం సాక్షిలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పలు సమస్యలు ఏకకాలంలో చుట్టుముట్టడంతో చివరకు తప్పనిస్థితిలో ఆయన బలవన్మరణానికి పాల్పడినట్టు సన్నిహితులు చెబుతున్నారు. అందరి కష్టాలను మీడియా సాక్షిగా సమాజానికి వెల్లడించే జర్నలిస్ట్ చివరకు తమ కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక ఇలాంటి చర్యలకు పూనుకోవడం విచారకరంగా మారుతోంది. ఓవైపు కాస్ట్ కటింగ్ పేరుతో పలు సంస్థల్లో సిబ్బంది కుదింపు చర్యలు జోరందుకున్నాయి. విశృంఖలంగా పెరిగిన ఎలక్ట్రానిక్ మీడియా గత కొంతకాలంగా స్తబ్దంగా మారింది. త్వరలో తిరోగమనం దిశను పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
బతకలేక బడిపంతులు అని ఒకప్పుడు చెప్పకున్నట్టుగా ఇప్పుడు పనిలేక పాత్రికేయుడు అనే పరిస్థితి వస్తోంది. ఈ వృత్తిని నమ్ముకున్న వారిని నిలబడలేని స్థితికి చేరుస్తోంది. చుట్టూ అలముకుంటున్న చిక్కులతో చివరకు ఏం కావాలో తెలియని దుస్థితి దాపురిస్తోంది. జర్నలిస్టుల పేరుతో కొందరు ఎర్నలిస్టులు అడ్డగోలుగా ఎగబాకుతున్న వేళ నిజమైన పాత్రికేయులు అంధకారంలో చిక్కుకుంటున్నారు. ఆఖరికి ఇలా తయారవుతున్నారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకు ప్రభాకర్ ఓ ఉదాహరణగా మిగిలిపోయారు. జోహార్ ..జర్నలిస్ట్ మిత్రమా..!!