Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జర్నలిస్టులు జేజేలు పలుకుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందజేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రిలో పది నెలల క్రితం టీవీ 5 తాతాజీ, ఆ తర్వాత కొన్నాళ్లకు విజయవాడ టీవీ 9 కెమెరామన్ రుద్రభాను ప్రకాష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ సమయంలోనే ఆ కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఈ మేరకు శనివారం ఆయా కుటుంబాల సభ్యులకు పది లక్షల రూపాలయ చెక్కులను మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసేందుకు చెక్ లు రెడీ చేసి పెట్టాను వచ్చి తీసుకెళ్లాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ చేసి చెప్పారని వెల్లడించారు. దీంతో ముఖ్యమంత్రి నిర్ణయానికి జర్నలిస్టులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జర్నలిస్టులు పెడుతున్న పోస్టులు ఆయా గ్రూపుల్లో రెండు రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి.
పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య సిబ్బంది తదితర ఉద్యోగులతో పాటు జర్నలిస్టులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి విధుల్లో పాల్గొంటున్నారు. జర్నలిస్టుల సేవలను దృష్టిలో ఉంచుకుని వారికి ప్రభుత్వం ఉచితంగా ముందస్తు పరీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆపదలో ఉన్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి రావడం శుభ పరిణామమని జర్నలిస్టులు, ఆయా సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే… కరోనా సంక్షోభం మీడియా రంగాన్ని కూడా కుదిపేసింది. మా వార్తల వల్లే డాక్టర్లు, పారిశుధ్య సిబ్బందికి జీతాల్లో కోతలు పడలేదని, ప్రభుత్వాలు బోనస్ లు ప్రకటించాయని `కొత్త పలుకులు`, సూక్తులు పలికే సంస్థ కూడా కొంత కాలం పాటు ఇంట్లోనే ఉండాలని ఆపదకాలంలో చాలా మంది ఉద్యోగులను సంస్థ నుంచి పంపేసింది. క్లిష్ట సమయంలో కూడా పని చేస్తున్న ఉద్యోగులకు 25 శాతం నుంచి 40 శాతం వరకు రెండు నెలలుగా జీతాల్లో కోతలు పెట్టింది. కోతలు కొనసాగుతాయనే సంకేతాలు పంపిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ సతీమణి వైఎస్ భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షి మాత్రం సంస్థకు ఆదాయం లేకపోయినా.. ప్రకటనలు తగ్గినా.. ఉద్యోగుల్లో కానీ.. జీతాల్లో కానీ ఇప్పటి వరకూ ఎలాంటి కోతలూ విధించ లేదు. కష్టమో.. నష్టమో.. మనమే భరిద్దామనే ధోరణి యాజమన్యం ప్రదర్శిస్తోంది. అంతేకాదు.. అన్ని పత్రికలతో పాటు లాక్ డౌన్ కారణంగా తాత్కాలికంగా కుదించిన జిల్లా అనుబంధాలను అందరి కంటే ముందుగా ఈ ఆదివారం నుంచి మళ్లీ తీసుకొచ్చి సంక్షోభం కారణంగా నిరాశలో ఉన్న జర్నలిస్టుల జీవితాల్లో ఆశలు చిగురించేలా చేసింది.