iDreamPost
iDreamPost
ఓవైపు గ్రేటర్ లో వస్తున్న ఫలితాలతో బీజేపీలో కొంత మోదం, మరికొంత ఖేదం అన్నట్టుగా ఉంది. ఆశించినట్టుగా జీహెచ్ఎంసీ పీఠం దక్కకపోయినా, కనీసం గట్టి పోటీ ఇవ్వగలిగిన సంతృప్తి మాత్రం ఆపార్టీలో కనిపిస్తోంది. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న నాగపూర్ లో శాసనమండలి ఎన్నికల ఫలితతంతో బీజేపీకి షాక్ తగిలింది. డెక్కన్ హైదరాబాద్ లో పాగా వేయాలని కలలు కంటుంటే, దక్కన్ పీఠభూమిని ఆనుకునే ఉన్న నాగపూర్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పీఠం కోల్పోవడం నిరాశ పరుస్తోంది.
నాగపూర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మిత్రపక్షాన్ని దూరం చేసుకున్న తర్వాత బీజేపీ తీవ్రంగా సతమతం అవుతోంది. సరిగ్గా అదే సమయంలో నాగపూర్ ఎమ్మెల్సీ పీఠం కోల్పోవడం బీజేపీకి ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సన్నిహితుడు, నాగపూర్ మాజీ మేయర్ సందీప్ జోషి ఇక్కడ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సందీప్ జోషికి 25,898 ఓట్లు రాగా, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ వంజారి 35,509 ఓట్లు సాధించారు.
నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థానం మాత్రమే కాకుండా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సీటు కూడా కావడం విశేషం. అదే సమయంలో నాగపూర్ ప్రాంతానికే చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ కి ఇది దాదాపు సొంత సీటు. అందుకు తగ్గట్టుగా ఈ ఇద్దరు కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రులు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కానీ తీరా చూస్తే బీజేపీకి గట్టి పట్టున్న ఏరియాలో ఇప్పుడు కమలనాథులు ఖంగుతినాల్సి వచ్చింది. ఈ ఓటమి బీజేపీకి మహారాష్ట్ర రాజకీయాల్లో ఎదురవుతున్న తీవ్ర పరిణామాలకు కొనసాగింపుగా కొందరు భావిస్తున్నారు. శివసేనను దూరం చేసుకున్న తర్వాత ఒంటరిగా మారిన బీజేపీ కి భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు తప్పవని ఈ ఫలితం చాటి చెబుతున్నట్టుగా అంచనా వేస్తున్నారు.