iDreamPost
android-app
ios-app

నూరవ టెస్టులో సెంచరీ

నూరవ టెస్టులో సెంచరీ

క్రికెట్ క్రీడలో 100 అనే సంఖ్యకు ప్రాధాన్యత చాలా ఉంది. బ్యాటింగ్ చేయడానికి మైదానంలో దిగిన ప్రతి ఆటగాడు ప్రతి సారీ వంద పరుగులు సాధించాలనుకుంటాడు. అలాగే కెరీర్ మొదలుపెట్టిన ప్రతి ఆటగాడు వంద మ్యాచులు ఆడాలనుకుంటాడు. తన నూరవ మ్యాచ్ లో సెంచరీ సాధిస్తే ఆ ఇన్నింగ్స్ ప్రత్యేకత మరో లెవల్లో ఉంటుంది.

నేడు చెన్నైలో ఇంగ్లాండు, భారత జట్ల మధ్య మొదలైన టెస్టు మ్యాచ్ ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ ఆడుతున్న నూరవ టెస్టు మ్యాచ్. 63 పరుగుల జట్టు స్కోరు వద్ద వెంటవెంటనే రెండు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లాండు కెప్టెన్ ధాటిగా ఆడి, అప్పటివరకూ నిదానంగా నడుస్తున్న తమ ఇన్నింగ్స్ లో వేగం పెంచాడు. ఆట ముగిసే సమయానికి 197 బంతుల్లో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచి తన నూరవ టెస్టులో సెంచరీ సాధించిన తొమ్మిదో ఆటగాడు అయ్యాడు.

తన కెరీర్ నూరవ టెస్టులో సెంచరీ సాధించిన మొదటి ఆటగాడు ఇంగ్లాండుకు చెందిన కోలిన్ కౌడ్రీ. 1968లో ఆస్ట్రేలియా జట్టు మీద అతను ఈ రికార్డు సాధించాడు. ఆ తరువాత జావేద్ మియాందాద్ (పాకిస్తాన్), గార్డన్ గ్రీనిడ్జ్ (వెస్టిండీస్), అలెక్ స్టీవార్ట్ (ఇంగ్లాండు), ఇంజమామ్ ఉల్ హక్ (పాకిస్తాన్), రిక్కీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), గ్రీమ్ స్మిత్ (సౌతాఫ్రికా), హషీమ్ ఆమ్లా (సౌతాఫ్రికా) ఈ ఘనత సాధించారు. ఇందులో ఒక్కరు కూడా భారత ఆటగాళ్లు లేరు. ఇప్పటి వరకు పదిమంది భారత ఆటగాళ్లు వందకు పైగా మ్యాచ్ లు ఆడినా, సచిన్ టెండూల్కర్, ద్రావిడ్, గంగూలీ, సెహ్వాగ్, లక్ష్మణ్, గవాస్కర్ లాంటి బ్యాట్స్ మెన్ ఎవరూ తమ నూరవ మ్యాచ్ లో సెంచరీ సాదించలేకపోయారు. యువ బ్యాట్స్ మెన్ కోహ్లీ, రహానే, పూజారా లాంటి వారు ఎవరైనా ఈ ఘనత సాధిస్తారేమో చూడాలి.

పాంటింగ్ రెండు సెంచరీలు

2006లో ఆస్ట్రేలియాలో పర్యటించిన సొతాఫ్రికాతో జరిగిన సిరీస్ లోని రెండవ మ్యాచ్ ఆస్ట్రేలియా కెప్టెన్ రిక్కీ పాంటింగ్ కెరీర్ లో నూరవ టెస్టు మ్యాచ్. దానిలో మొదటి ఇన్నింగ్స్ లో 103 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 116 పరుగులు సాధించాడు పాంటింగ్.