iDreamPost
android-app
ios-app

మణిపూర్ లో బీజేపీకి జేడీయూ గండం

  • Published Feb 06, 2022 | 9:48 AM Updated Updated Mar 11, 2022 | 10:19 PM
మణిపూర్ లో బీజేపీకి జేడీయూ గండం

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఒక్కొక్కసారి ఒక్కో పార్టీకి కలిసి వస్తుంటుంది. మరికొన్ని పార్టీలు అనూహ్యంగా దెబ్బ తింటుంటాయి.ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మణిపూర్ లో అలాంటి పరిస్థితే ఉత్పన్నమైంది. సీన్లోనే లేని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) పార్టీ అకస్మాత్తుగా తెరపైకి రాగా.. దాని వల్ల అధికార బీజేపీ అవకాశాలకు గండిపడే ప్రమాదం ఏర్పడింది. కనీసం పదిమంది ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు నిరాకరించడం, అది పార్టీలో తిరుగుబాట్లు, వలసలకు దారి తీయడం జేడీయూ కు కలిసొచ్చింది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన ప్రముఖులందరిని అక్కున చేర్చుకుని టికెట్లు ఇవ్వడం ద్వారా జేడీయూ కాషాయ దళాన్ని సవాల్ చేస్తోంది.

బీజేపీ ధీమాపై దెబ్బ

గత ఎన్నికల్లో పలు స్థానిక పార్టీలను కలుపుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ ఎన్నికల్లోనూ మళ్లీ గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తం 60 స్థానాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. అయితే పరిస్థితులు అలా లేవు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించేందుకు బీజేపీ పదిమంది సిటింగ్ ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు టికెట్లు నిరాకరించింది. దాంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి పెల్లుబికింది. టికెట్లు రాని వారందరూ తిరుగుబాటు చేశారు. పార్టీని వీడి బయటకు వెళ్లిపోయారు. అటువంటి వారందరినీ జేడీయూ ఆహ్వానించి టికెట్లు ఇచ్చింది. మరోవైపు మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) మణిపూర్ లో కీలక పాత్ర పోషిస్తుంటాయి. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన ఈ రెండు పార్టీలు ప్రస్తుతం విడిగా పోటీ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ బీజేపీ అవకాశాలపై ప్రభావం చూపనున్నాయి.

కంట్లో నలుసులా జేడీయూ

వాస్తవానికి జాతీయ స్థాయిలో జేడీయూ ఎన్డీయే భాగస్వామిగా ఉంది. కేంద్రంలోనూ, బీహార్ ప్రభుత్వంలోనూ బీజేపీతో కలిసి పనిచేస్తోంది. కానీ కొన్నాళ్లుగా బీజేపీ, జేడీయూ మధ్య పొసగడం లేదు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ జేడీయూ బీజేపీతో కాకుండా విడిగా పోటీ చేస్తోంది. ఇప్పుడు మణిపూర్ లోనూ అదే స్టాండ్ తీసుకుని కమలం కంట్లో నలుసులా మారింది. 2003 నుంచి మణిపూర్ లో జేడీయూ పని చేస్తున్నా పెద్ద ప్రభావం చూపలేదు. కానీ ఈసారి బీజేపీలో తిరుగుబాట్లను ఆసరా చేసుకుని ఒక్కసారిగా పుంజుకుంది. ఆ పార్టీలో టికెట్ లభించని 10 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెసుకు చెందిన పలువురు ప్రముఖులను చేర్చుకుంది. జేడీయూ ప్రకటించిన 36 మంది అభ్యర్థుల జాబితాలో వారందరికి చోటు కల్పించింది. మణిపూర్ ఓటర్లు రాజకీయ పార్టీలకు, సిద్ధాంతాలకు ప్రధాన్యమివ్వరు. అక్కడ డబ్బు, నేతల పలుకుబడి ఎన్నికల్లో విజయావకాశాలను ప్రభావితం చేస్తాయి. 2012 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఇటువంటి అవకాశాలనే అందిపుచ్చుకుని ఏకంగా 7 స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు ఆ అవకాశం జేడీయూ తలుపుతట్టింది. ఆ పార్టీ జాబితాలో ఉన్న వారిలో చాలామంది ప్రముఖులే కావడంతో ఈసారి మణిపూర్ లో జేడీయూ విజయాల బోణీ కొట్టడమే కాకుండా ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.