Idream media
Idream media
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుగేశం పార్టీ గెలుచుకున్న ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రి. ఇప్పుడు అక్కడ కూడా పార్టీ చెల్లాచెదురైపోతోంది. వర్గాలుగా విడిపోయి పార్టీలో ఆధిపత్యం కోసం దూషణలకు దిగుతున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న కుటుంబానికి, ఆ తర్వాత జరుగుతున్న కుటుంబానికి మధ్య జరుగుతున్న ఈ పోరులో కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు.
అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ కుటుంబం చేరడాన్ని ప్రభాకర్ చౌదరి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. సమయం దొరికినప్పల్లా జేసీ ఫ్యామిలీపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే దివాకర్ రెడ్డి సోదరుడు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రతినిత్యం అధికార పార్టీ తో పాటు సొంత పార్టీపై కూడా ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే స్వపక్షంలోనే విపక్షంలా తయారైంది. ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ చౌదరి మధ్య ఆధిపత్య పోరుకు ఫుల్ స్టాప్ పెట్టాలని అధిష్టానం ఎన్ని సార్లు ప్రయత్నించినా నేతలు మళ్లీ మొదటికే వస్తున్నారు. జిల్లా పరిస్థితిని చక్కబెట్టలేక చంద్రబాబు తలపట్టుకుంటున్నారని చెబుతున్నారు.
తాజాగా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతవరణం నెలకొంది. అవేసంస్థ ద్వారా వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుకున్నారు. ఇదే రోజు ప్రభాకర్ చౌదరి తాడిపత్రిలో కార్యకర్తలతో సమావేశం కానున్నారు. చంద్రబాబును సీఎం చేసేందుకే కార్యకర్తలతో ప్రభాకర్ చౌదరి సమావేశం అవుతున్నానని చెబుతున్నారు. పోటా పోటీ కార్యక్రమాలతో తాడిపత్రిలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభాకర్ రెడ్డికిధీటుగా చౌదరి కార్యకర్తలతో సమావేశం కావడం జిల్లా టీడీపీలో ఆధిపత్యపోరు మరింత ఆజ్యం పోస్తుందని ఆ పార్టీ నేతలు ఆందోళనలో ఉన్నారు.
ఇటీవల రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై అనంతపురంలోని కమ్మ భవన్ ఓ సమావేశం నిర్వహించారు. టీడీపీకి చెందిన ఏ ఒక్క నాయకుడూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఇద్దరు నేతల కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీంతో ఆయనపై జిల్లా టీడీపీ నేతలంగా మూకుమ్మడిగా దాడి చేశారు. వీరిలో ప్రభాకర్ చౌదరి గట్టిగానే బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జేసీ ఫ్యామిలీ చేసిన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జిల్లాలో పోరాటాలు చేశామని గుర్తుచేశారు. జేసీ కుటుంబమే టీడీపీకి సమస్యగా మారిందని ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి తెరపడక ముందే మరోసారి ఇద్దరూ తలపడుతున్నారు.
అధికార పార్టీ విధానాలపై పోరాటం చేయాలని అధిష్ఠానం పిలుపు ఇస్తున్న తరుణంలో సొంత పార్టీలో ఆధిపత్యం కోసం ఇద్దరు సీనియర్ నేతలు పోరాడుతుండడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. మరోవైపు నేతలు నియోజకవర్గాల్లో నువ్వా.. నేనా అంటూ పోటీపడుతుండటంతో కార్యకర్తలు ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.