Idream media
Idream media
అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. 2019 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, మూడు రాజధానులను వ్యతిరేకించడం, ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు అవకాశం లేని పాలన వల్ల.. ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ నేతలుకు సరైన అంశం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో తమకు తాముగా కొన్ని అంశాలను సృష్టించుకుని ప్రజల్లో వెళుతున్నారు. ఉత్తరాంధ్రను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ.. ఆ ప్రాంత నేతలు విశాఖలో సదస్సు నిర్వహించగా.. తాజాగా రాయలసీమ నేతలు.. సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం అంటూ ఆయా ప్రాజెక్టులను సందర్శించి.. వాటిపై చర్చించేందుకు ఈ రోజు అనంతపురంలో సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుల్లో టీడీపీ నేతలు.. వైసీపీ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేయగా.. మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం సొంత పార్టీ, పార్టీ నేతల తీరును ఏకిపారేశారు. అసంబద్ధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండేళ్లలో కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోకుండా, వారు ఎలా ఉన్నారో కూడా తెలుసుకోకుండా.. సదస్సులు పెడితే వచ్చేస్తారా..? అంటూ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు పరోక్షంగా చురకలు అంటించారు. ఇప్పుడు పెట్టాల్సింది నీటి సదస్సులు కాదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. కార్యకర్తల మీటింగ్‌లు పెట్టాలని కుండబద్ధలు కొట్టేలా చెప్పడంతో సదస్సులో ఉన్న టీడీపీ నేతల నోట మాట పెగల్లేదు.
Also Read : హనుమంతరాయ చౌదరి పదవి కోసమేనా యాత్రలు,కొట్లాటలు?
పార్టీని నాశనం చేస్తున్నారు..
అనంతపురం జిల్లాను టీడీపీకి కంచుకోట వంటిదని జేసీ ప్రభాకర్ రెడ్డి అభివర్ణించారు. జిల్లాలో ఓటు బ్యాంకు ఉంది కాబట్టే మనమంతా నాయకులుగా చెలామణి అవుతున్నామన్నారు. కానీ జిల్లాలో ఏ ఒక్క కార్యకర్త సాధకబాధలు ఏ ఒక్క నాయకుడు అయినా పట్టించుకున్నాడా..? అంటూ ఫైర్ అయ్యారు. ఇద్దరు నాయకులు జిల్లాలో పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు నీటి ప్రాజెక్టులపై ఇలానే చేశాయన్న జేసీ.. అప్పుడు ఏమైనా అయిందా..? అంటూ ప్రశ్నించారు.
జిల్లాలోని ఇద్దరు నాయకులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కయ్యారని జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గుంటూరు జిల్లాలో నారా లోకేష్ పర్యటనకు రానీ పోలీసులు అనుమతి ఇక్కడ నీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ నేతలతో కుమ్మక్కు అయ్యారు కాబట్టే పోలీసుల నుంచి అనుమతి వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. ఆ ఇద్దరు నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని జేసీ మండిపడడంతో అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు.
Also Read : మంత్రిగా పని చేశారు కదా..? ఆ మాత్రం తెలియదా కాల్వ శ్రీనివాస్ గారు