Idream media
Idream media
బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి విక్రయించిన కేసులో అరెస్ట్ అయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి వ్యవహారంలో అర్థరాత్రి కొత్త ట్విస్ట్ చేటుచేసుకుంది. నిన్న శనివారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వారిద్దరినీ అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు వారిని అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం అనంతపురం జిల్లా కోర్టులో తండ్రీ కొడుకులను హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు.
14 రోజుల రిమాండ్ విధించడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య అనంతపురం జైలుకు తరలించారు. ఆ సమయంలో జేసీ అనుచరులు ఆందోళనలకు దిగారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య వారిద్దరినీ అనంతపురం జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు అర్థరాత్రి తరలించారు. అనంతపురం జైలులో ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకడంతో ముందు జాగ్రత్తగా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు.
అంతకు ముందు అనంతపురం జైలు లోపలికి వెళ్లే ముందు ఆందోళన చేస్తున్న అనుచరులతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎవరూ ఆందోళన పడొద్దన్నారు. త్వరలోనే తాను బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. వాహనాల విక్రయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల ప్రమేయం ఏమీ లేకపోయినా కుట్రపూరితంగా వారిపై కేసులు పెట్టారని వారి తరఫున న్యాయవాది పేర్కొన్నారు. బెయిల్ త్వరగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.