Idream media
Idream media
ఫోర్జరీ పత్రాలతో బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి విక్రయించిన కేసులో అరెస్ట్ అయి కడప సెంట్రల్ జైల్‌లో ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు మరికొన్ని రోజులు జైలు జీవితం తప్పలేదు. ఈ కేసులో ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో వీరిద్దరినీ అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించారు. నిన్న శుక్రవారంతో వీరి రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అనంతపురం కోర్టులో హాజరుపరచగా జడ్జి వచ్చే నెల 1వ తేదీ వరకూ రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఈ కేసులో అనంతపురం కోర్టులో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సతీమణి తన భర్త, కుమారుడు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందనేది తెలియరాలేదు. బుధవారం హైకోర్టు రిజిస్ట్రార్ కరోనా వైరస్‌తో మరణించడంతో ఉన్నఫలంగా హైకోర్టుకు సెలవు ప్రకటించారు. ఈ నెల 28వ తేదీ వరకూ హైకోర్టు సెలవులో ఉండనుంది. తిరిగి హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత జేసీ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందనేది తెలుస్తుంది.