iDreamPost
android-app
ios-app

వీరిలో కరోనా సోకిందెవరికి..!?

  • Published Aug 22, 2020 | 5:04 PM Updated Updated Aug 22, 2020 | 5:04 PM
వీరిలో కరోనా సోకిందెవరికి..!?

ఇక్కడ కన్పిస్తున్న రెండు ఫోటోల్లోనూ ఉన్నది ఇద్దరూ ప్రముఖులే. ఇద్దరూ అధికారంలో ఉండగాచేసిన చట్టవ్యతిరేక కార్యకలాపాల కారణంగా ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. అయితే వీరిద్దరి ఫోటోలు చూపించి కరోనా ఎవరికి సోకింది? అని క్వశ్చిన్‌ వేస్తే ఠక్కుమని పీపీఈ కిట్‌ ధరించిన వారికి అని చిన్నపిల్లాడు కూడా చెప్పేస్తాడు. ఎందుకంటే కరోనా మీద దాదాపు అన్ని వయస్సుల వాళ్ళకి ఆ స్థాయిలో అవగాహన వచ్చేసింది మరి. వైరస్‌ సోకిన వారి నుంచి ఇతరులకు వ్యాధి ప్రభలకుండా తగు జాగ్రత్తలు పాటించండి మహాప్రభో అని వైద్యులు, ప్రభుత్వాలు చెవినిల్లుకట్టుకుని పోరుతున్నాయి.

కానీ ఇక్కడున్న రెండు ఫోట్లోనూ పీపీఈ కిట్‌ లేకుండా ఉన్న ఫోటోను చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోంది. ఆయనకు ఇప్పటి వరకు చికిత్స చేసిన ప్రైవేటు వైద్యులు అచ్చెన్నాయుడికి కరోనా సోకిందని వెల్లడించారు. దానికి చికిత్స తీసుకుంటున్నారని ప్రకటించేసారు. అయితే ఇక్కడే పలు సందేహాలకు తావిస్తోంది. అచ్చెన్న చికిత్స పొందుతున్న ఆసుపత్రి ఆయన పార్టీకి అత్యంత సానుభూతిపరుడిగా పేరు గాంచిన వైద్యుడి పర్యవేక్షణలోనిది. ఇప్పటికే సదరు ఆసుపత్రిపై కరోనా లేకుండానే ఉందని చెప్పి లక్షల్లో డబ్బులు పిండేసారని ఫిర్యాదులు ఉన్నాయి. వాటిపై విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అచ్చెన్నకరోనాపై అనేకానేక సందేహాలకు బలం చేకూరుతోంది.

కరోనా సోకిన వ్యక్తికి చికిత్స అందించే సమయంలో నిర్ణీత ప్రోటోకాల్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకుని వైద్యం చేయాలి. అందులో భాగంగానే రోగికి మాస్క్, పీపీఈ కిట్‌ వేయడం, ఇతరులు రోగికి మూడు మీటర్ల దూరం పాటించాలి. అలాగే రోగి వద్దకు వెళ్ళాలంటే వైద్య సిబ్బంది కూడా పీపీఈ కిట్, మాస్క్, ఫేస్‌షీల్డ్‌ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

అటువంటిది అచ్చెన్నాయుడి విషయంలో అటువంటివేమీ పాటిస్తున్నట్లు కన్పించడం లేదు. కరోనాతో బాధపడుతున్న అచ్చెన్నాయుడికి కనీసం పీపీఈ కిట్‌ కూడా వేయకుండా ఆసుపత్రి బైటకు వచ్చేసారు. పోనీ చుట్టుపక్కలున్న వాళ్ళు కూడా సదరు కిట్‌ను వేసుకోలేదు. సాధారణ పేషెంటుకు మాదిరిగానే మాస్కును పెట్టి, వీల్‌ఛైర్‌లో తీసుకువెళ్ళిపోయారు. దీనిని చూస్తుంటే అసలు అచ్చెన్నాయుడికి కరోనా సోకిందా? సోకలేదా? సోకితే జాగ్రత్తలు ఎందుకు పాటించడం లేదు? వంటి ప్రశ్నలు ప్రస్తుతం ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ ప్రశ్న కంటే ఎక్కువగా విన్పిస్తోంది. సినిమా ప్రశ్న అయితే పబ్లిసిటీ స్టంట్‌ అని తేలింది.

కానీ అచ్చెంకరోనా క్వశ్చిన్‌కు ఆన్సర్‌ ఏంటంట? అంటూ శంకారాయుళ్ళు శివాలెత్తిపోతున్నారు. జూలై మొదటి తేదీన గుంటూరు జీజీహెచ్‌ నుంచి ఏ విధంగానైతే వచ్చారో ఇప్పుడు కూడా (కరోనాతో) అదే విధంగా రమేష్‌ ఆసుపత్రి నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి వెళుతుండడాన్ని పోల్చి చూస్తున్నారు. అప్పుడు ఫైల్స్‌ తగ్గాయని వైద్యులు డిశ్ఛార్జి చేసిన సమయంలో ఎలా బయటకు వచ్చారో.. ఇప్పుడు కరోనా వైరస్‌ సోకిందని తేల్చినా.. ఒకే విధంగా ఎలా వెళుతున్నాడబ్బా.. అంటూ బుర్రలు బద్దలుకొట్టేసుకుంటున్నారు.

కరోనా సోకిన జేసీ ప్రభాకరరెడ్డి జైలు నుంచే పీపీఈ కిట్‌ ధరించి బైటకు వచ్చారు. అంతే జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నారు. మరో పక్క ఎటువంటి పీపీఈ కిట్టు ధరించకుండా ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడుని బైటకు వచ్చి, మరో ఆసుపత్రికి వెళ్ళారు. చుట్టూ ఉన్న ఆయన సహాయకులు, ఆసుపత్రి సిబ్బంది కూడా అతి దగ్గరగానే ఉంటున్నారు. వీటన్నిటినీ పరికిస్తే సందేహాలు ఎక్కువైపోతున్నాయి. ఇందులో నిజానిజాలు అచ్చెన్నకు, ఆయనకు వైద్య మందించిన వైద్యులకే తెలియాలి.