iDreamPost
iDreamPost
ఐదేళ్ల న్యాయపోరాటం ముగిసింది.. ఇన్నాళ్లూ మూత పడిన ఆ బంగ్లా తలుపులు తెరుచుకున్నాయి. ఒకప్పుడు సందర్శకులు, నేతలు, కార్యకర్తలు, రాజకీయ కార్యకలాపాలతో కళకళలాడిన ఆ భవనం.. ఆస్తుల వివాదంలో చిక్కుకుని తాళాలు వేసుక్కూర్చుంది. ఎట్టకేలకు కోర్టు తీర్పు ఆ వివాదాల సంకెళ్లను తెంచేసింది. ఆ భవనం వారసుల చేతిలోకి వెళ్లి ఐదేళ్ల తర్వాత తెరుచుకుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాస భవనంలో మళ్లీ సందడి నెలకొంది. జయ మేనకోడలు దీపాజయకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి మేనత్త ఇంట్లోకి సాధికారికంగా ప్రవేశించారు.
జయ అధికారం, ఆస్తులపై వివాదాలు
అన్నాడీఎంకే అధినేత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రి గతంలో ఏకఛత్రాధిపత్యం వహించిన జయలలిత 2016 డిసెంబర్ ఐదో తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. పెళ్లి, సంతానం వంటివేవీ లేని జయ మరణంతో.. అన్నాడీఎంకేపై ఆధిపత్యం, ప్రభుత్వాధికారంతోపాటు ఆమె ఆస్తులపై పలు వివాదాలు నెలకొన్నాయి. పోరాటాలు మొదలయ్యాయి. పార్టీ, ప్రభుత్వంపై పెత్తనం కోసం అన్నాడీఎంకే నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామి, చిన్నమ్మ శశికళ మధ్య పోరాటం మొదలైంది. కోర్టుల వరకు వెళ్లింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోగా.. పార్టీ నాయకత్వ పోరు మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.
మరోవైపు జయలలిత ఆస్తుల విషయంలోనూ వివాదం రాజుకుంది. మరణించే వరకు జయ నివసించిన చెన్నై పోయస్ గార్డెన్లోని వేదనిలయం బంగ్లా వారసులమైన తమకు దక్కుతుందని జయలలిత సోదరుని కుమార్తె దీపాజయకుమార్, ఆమె సోదరుడు దీపక్ వాదించగా.. దాన్ని స్మారక మందిరం చేస్తామంటూ గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఆ భవనాన్ని స్వాధీనం చేసుకుంది.
హైకోర్టు తీర్పుతో..జయ బంగ్లాలోకి వారసులు
ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దీప, ఆమె సోదరుడు దీపక్ లు హైకోర్టులో కేసు వేశారు. జయ నివాసాన్ని ఆమె స్మారక మందిరంగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం వాదించగా.. చెన్నై మెరీనా బీచ్లో ఇప్పటికే ఒక స్మారక మందిరం ఉన్నందున.. ఇంకొకటి ఎందుకని కోర్టు ప్రశ్నించింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ గత నెల 24న తుది తీర్పు ప్రకటించింది.
జయలలితకు చట్టబద్ధ వారసులు దీప, దీపక్ లేనని నిర్ధారించింది. కోట్లు విలువ చేసే జయ నివాస భవనాన్ని వారికి అప్పగించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు చెన్నై పాలనా యంత్రాంగం బంగ్లా తాళాలను దీపకు అందజేయడంతో శనివారం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అందులోకి ప్రవేశించారు. అత్త ఇంట్లో చేరడం ఎంతో ఆనందంగా ఉందని.. దీన్ని రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగించబోనని దీప స్పష్టం చేశారు.