iDreamPost
iDreamPost
అందరూ ఊహించినట్లుగానే ఏపీ బీజేపీకి మళ్లీ సినీ గ్లామర్ వచ్చింది. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్నారో లేదో తేలియని జయప్రద, రాజమండ్రి సభలో జాతీయ అధ్యక్షుడు నడ్డా పక్కన కనిపించారు.
రాజమండ్రి నా స్వస్థలం.. ఇక్కడి నుండే రాజకీయాల్లోకి వెళ్లానంటూ లోకల్ టచ్ ఇచ్చారు. ఇక మీద ఏపీ బీజేపీలో జయప్రద బీజీగా కనిపించొచ్చు.
అసలు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బీజీ కాబోతున్నానని ఆమె ప్రైవేట్ సంభాషణల్లో చెప్పడంతోనే, అందరూ తెలంగాణ రాజకీయాల్లో జయప్రద అడుగు పెడతారని, వీలైతే సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో బరిలోకి దిగుతారని అనుకున్నారు. వ్యూహం మారిందేమో! ఏపీ బీజేపీ సభలో ప్రత్యక్షమయ్యారు.
తన జన్మభూమి రాజమండ్రి అని, కర్మభూమి ఉత్తర ప్రదేశ్ జయప్రద చెప్పుకొచ్చారు. అంటే ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్టు తేల్చేసినట్లే. నడ్డాతోపాటు ఆమెకూడా వైసీపీ ప్రభుత్వంపై నాలుగు మాటలు అనేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రైతులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇప్పుడు ఏపీ బీజేకీకి కావల్సింది కాసింత గ్లామర్. జనం గుర్తుపట్టగలిగే పాపులారిటీ ఉన్న నేతలు. అందుకే జయప్రదను ఏపీ జనం ముందుకు తీసుకొచ్చారనుకోవాలి.
దేశంలో అన్నిపార్టీలకన్నా సినీ గ్లామర్ ఎక్కువగా కనిపించే పార్టీ బీజేపీ. క్రికెటర్లు, బిజినెస్ మేన్లు, ఇతర రంగాల ప్రముఖులనూ ఆ పార్టీ తమ వైపు తిప్పుకుంటోంది. సినిమా హీరోలు సానుభుతిపరుల్లా ఉంటే, హీరోయిన్లు మాత్రం చురుగ్గా మద్దతునిస్తున్నారు. తెలంగాణ బీజేపీకి విజయశాంతి సినీ గ్లామర్ తోడు. అప్పుడప్పుడూ మాధవీలత ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.
ఏపీ బీజేపీలో అంత పాపులారిటీ ఉన్న నేతలు, ముఖ్యంగా మహిళా నేతలు లేరు. పురంధ్రీశ్వరి మినహా చెప్పుకోదగ్గవారు ఎవరు? యామినీ శర్మ హడావిడి చూపించినా, ఆమె కూడా వెనక్కు తగ్గినట్టు కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా జయప్రద బీజేపీ ఫేస్ కాబోతున్నారు. మరి ఆమె ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? లోకట్ టచ్ తో రాజమండ్రి బరిలో దిగుతారా? చూడాలి.