iDreamPost
android-app
ios-app

అసెంబ్లీలో జయము జయము చంద్రన్న..

అసెంబ్లీలో జయము జయము చంద్రన్న..

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచార ఖండూతిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టారు. పేరు గొప్ప..ఊరు దిబ్బ సామెత మాదిరిగా టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన, చేసుకున్న ప్రచారం ఏ స్థాయిలో సాగిందో అసెంబ్లీలో రెండు నిమిషాలలో సీఎం వైఎస్‌ జగన్‌ కడిగిపారేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో వెళ్లిన మహిళలు స్పిల్‌ వే వద్ద పాడిన జయము జయము చంద్రన్న నీకు.. అనే భజన పాటను ఈ రోజు అసెంబ్లీలో ప్రదర్శించారు. ప్రాజెక్టు పనులకు ఎనిమిదిసార్లు శంకుస్థాపన చేయడంతోపాటు.. ప్రజలను అక్కడకి తరలించి ప్రజా ధానాన్ని చంద్రబాబు ఏ విధంగా వృధా చేశారో సీఎం వైఎస్‌ జగన్‌ సభలో చెప్పారు. బస్సుల ద్వారా టీడీపీ కార్యకర్తలను అక్కడకు తరలించేందుకు 83.45 కోట్ల రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం జగన్‌ చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలోనే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో ఉచిత రవాణా కల్పించి ప్రజలను అక్కడకి తరలించారు. ఈ బాధ్యతను స్థానిక ప్రజా ప్రతినిధులకు అప్పగించారు. ఎమ్మెల్యేలు సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లను తీసుకెళితే.. వారు టీడీపీ కార్యకర్తలను ఆర్‌టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వ ఖర్చుతో భోజనాలు కూడా ఏర్పాటు చేయించారు. పట్టిసీమ, నదుల అనుసంధానం, పోలవరం సహా వివిధ ప్రాజెక్టులపై చంద్రబాబు చేసుకున్న స్వియ స్కోత్కర్షను నాడు రాష్ట్ర ప్రజలు కళ్లారా చూసి, చెవులారా విన్నారు. నేడు అసెంబ్లీలో చంద్రబాబుకు ఉన్న ఉన్న ప్రచార ఖండూతిని, దాని వల్ల ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాదు… అమరావతిని సందర్శించే కార్యక్రమాన్ని కూడా నాడు చంద్రబాబు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులు రాజధాని అమరావతిని చూసేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. విద్యార్థులను తరలించే బాధ్యతను ఎంఈవోలకు, వారు ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులు నానా తంటాలు పడిన విషయం ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.