iDreamPost
iDreamPost
గుర్తింపు ఉన్న హీరోలకే థియేటర్ సినిమాలకు ఓపెనింగ్ రాక ఇబ్బంది పడుతుంటే బుల్లితెరపై మాత్రమే తళుక్కుమనే స్టార్ యాంకర్ సుమని టైటిల్ రోల్ లో మూవీ తీయడమంటే సాహసమే. అయినా దాని చేసి చూపించారు జయమ్మ పంచాయితీ టీమ్. పవన్ కళ్యాణ్ ట్రైలర్ ని లాంచ్ చేయడంతో అంతోఇంతో జనం దృష్టి దీనిపైకి మళ్లింది. నిన్న స్ట్రాంగ్ కాంపిటీషన్ మధ్య విడుదలైన ఈ విలేజ్ ఎంటర్ టైనర్ కు దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకుని తీసిన చిత్రమిది. అసలే అంచనాలు లేకుండా గ్రాండియర్లు రాజ్యమేలుతున్న టైంలో వచ్చిన జయమ్మ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.
శ్రీకాకుళం తాలూకాలో అదొక చిన్న గ్రామం. కలివిడిగా ఊళ్ళో వాళ్లంతా తనవాళ్ళే అనుకునేంత స్వచ్ఛమైన మనసు జయమ్మ(సుమ)ది. ఏ శుభకార్యం వచ్చినా తన స్థోమతకు మించి బహుమతులివ్వడం అలవాటు. ఓసారి జయమ్మ భర్త గౌరీనాయుడు(దేవి ప్రసాద్) అనారోగ్యానికి గురవుతాడు. కానీ అది నయం చేయించడానికి సరిపడా డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. దీంతో సమస్య పరిష్కారం కోసం జయమ్మ పంచాయితీకి వెళ్తుంది. అసలు తన వ్యక్తిగతమైన మొగుడి జబ్బుకి ఊరికి కనెక్షన్ ఏంటి, ఇంతటి కష్టాన్ని జయమ్మ ఎలా దాటుకుందనేదే ఈ సినిమాలో అసలు పాయింట్. యాంకర్ గానే పరిచయమున్న సుమను ఇందులో కొత్త రూపంలో చూస్తాం.
జయమ్మగా తన పరిధి మేరకు బాగా నటించింది. దర్శకుడు విజయ్ కుమార్ తననే ఎందుకు ఎంచుకున్నారో అర్థమవుతుంది. కాకపోతే సింగిల్ పాయింట్ మీద మలుపులు, ఎంగేజ్ చేసే మూమెంట్స్ లేకుండా కథనం ఫ్లాట్ గా నడవడంతో అధిక శాతం పంచాయితీ బోరింగ్ గా సాగుతుంది. ఆర్టిస్టులు ఎంత న్యాయం చేసినప్పటికీ వాళ్ళను సరైన రీతిలో వాడుకోలేపోయారు. పైగా ఓటిటి కాలంలో ఇలాంటి వాటితో మెప్పించడం కష్టం. అయినా రిస్క్ చేశారు. టీవీలో చూడటమే కష్టమనుకునే ఇలాంటి వాటికి డిజిటల్ రిలీజ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి. ఎంత తక్కువ అంచనాలున్నా సగటు కమర్షియల్ అంశాలను ఆశించే వాళ్ళను మరింత నిరాశ పరుస్తుంది జయమ్మ.