iDreamPost
android-app
ios-app

టిటిడి ఈవోగా జవహర్ రెడ్డి

టిటిడి ఈవోగా జవహర్ రెడ్డి

ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాదికారిగా సీనియర్ ఐఏఎస్అ ధికారి డా. కె.ఎస్ జవహర్ రెడ్డినియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కరోనా కష్టకాలంలో వైద్యశాఖను సమర్థంగా నడిపించడంలోను, సత్వరమే రాష్ట్రంలో పలు కోవిడ్ ఆస్పత్రుల ఏర్పాటు, రోజుకు వేలకొద్ది కోవిడ్ పరీక్షలు చేయడం వెనుక జవహర్ రెడ్డి కృషి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు.

కడప జిల్లాకు చెందిన జవహర్ రెడ్డి వెటర్నరీ విద్యలో ఉన్నత విద్య నభ్యసించారు. ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కీలక శాఖలు సమర్థవంతంగా నిర్వహించారు.

వివాదాలకు దూరంగా.. బాధ్యతలు దగ్గరగా

ప్రభుత్వం ఏదైనా అధికారంలో ఎవరు ఉన్న కీలక శాఖలకు అధిపతుల నియామకం చేసే ముందు ముఖ్యమంత్రికి గుర్తుకు వచ్చే కొందరిలో జవహర్ రెడ్డి ఒకరు. ఒక పార్టీ అధికారంలో ఉన్నపుడు కీలక శాఖలు నిర్వహించిన అధికారులను ప్రభుత్వం మారినప్పుడు అధినేతలు వారిని మారుస్తుంటారు. అందుకు జవహర్ రెడ్డి మినహాయింపు. దీన్ని బట్టే ఆయన పనితీరును, బాధ్యతలపట్ల చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు.

కరోనా సమయంలో ..

జవహర్ రెడ్డి కార్యదక్షత ఏ పాటిది అన్నది కరోనా సమయంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, నిర్ణయాలు ఉదాహరణగా నిలుస్తాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేసిన జవహర్ రెడ్డి నిరంతర కృషితో కరోనాను కట్టడి చేసే చర్యలు చేపట్టారు. కరోనాను ఎదుర్కొనడంలో ఆంద్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాలను

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అభినందించాయి. ఇంటింటి సర్వే, కరోనా రోగుల గుర్తింపు, ప్రయమరి, సెకండరీ కాంట్రాక్టులు గుర్తింపు వంటి చర్యలు పలు రాష్ట్రాలకు ఆదర్శమయ్యాయి. ఇక టిటిడి ఈవో పోస్ట్ ఎంతటి ఉన్నతమైనదో అంతటి సున్నితమైనది. అక్కడ ఏచిన్న పొరపాటు, తప్పిదం జరిగినా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తుంది. అలాంటి కీలక పదవిలో సౌమ్యుడు, వివాదరహితుడు, సమర్ధుడు అయిన జవహర్ రెడ్డిని నియమించడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు.

ఏకే సింఘాల్ ఆరోగ్య శాఖకు..

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి తిరుపతి దేవస్థానం ఈవోగా వెళ్లడంతో ఆ పోస్టులో ప్రస్తుత టిటిడి ఏవో ఏకే సింఘాల్ ను ప్రభుత్వం నియమంచింది. ఆయన గత తెలుగు దేశం హయాంలో నియమితులై దాదాపు రెండున్నరేళ్లు ఆ పదవిలో కొనసాగారు.