iDreamPost
iDreamPost
ఊహించనిట్టే జరుగుతోంది. జవాద్ తుఫాన్ తాకిడి నుంచి ఆంధ్రప్రదేశ్ గట్టెక్కినట్టేననే సంకేతాలు వస్తున్నాయి. తుఫాన్ క్రమంగా ఒడిశా వైపు సాగుతోంది. పూరీ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. జవాద్ తుఫాను విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది. ఉత్తర ఈశాన్యంగా పయనిస్తున్న తుఫాన్ రేపు మధ్యాహ్నానికి బలహీనపడిపోతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దాంతో ఇది ఉత్తరాంధ్ర వాసులకు ఉపశమనం కలిగించే సమాచారంగా ఉంది.
వాస్తవానికి వాయుగుండం బలపడి తుఫాన్ గా మారినప్పటికీ పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఇప్పటికీ భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. ఉత్తరాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. దాంతో తుఫాన్ తాకిడి తగ్గుతున్నట్టుగానే అంచనా వేశారు. దానికి అనుగుణంగానే జవాద్ తుఫాన్ సముద్రంలోనే బలహీనపడి తీరం దాటే సమయానికి మరింత సాధారణంగా మారిపోతుందని భావిస్తున్నారు. వాయుగుండంగా తీరం దాటవచ్చని కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర మీద జవాద్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇక తుఫాను ప్రభావం ఈరోజు సాయంత్రం తర్వాత పూర్తిగా తగ్గుతుందనే అంచనాలు వాతావరణ శాఖ నుంచి వస్తున్నాయి. అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినా మొత్తం మీద సాధారణ వర్షాలే నమోదవుతాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా అప్రత్తమయ్యింది. ప్రత్యేక అధికారులను నియమించింది. విపత్తు నిర్వహణ బృందాలను రంగంలో దింపింది. అన్ని రకాలుగానూ సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ మెసేజ్ జారీ అయినప్పటికీ ఆ స్థాయిలో నష్టం లేకుండా గట్టెక్కే అవకాశం ఉంటుందనే అభిప్రాయం. వస్తోంది.
ఓవైపు వరదల తాకిడి ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతుండగానే రెండోవైపు తుఫాన్ హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాయలసీమ, దక్షిణాంధ్ర ప్రాంత ప్రజలు గట్టెక్కకుండానే ఉత్తరాంధ్రను జవాద్ వణికిస్తుందనే భయాందోళన కనిపించింది. కానీ తీరా ఆస్థాయిలో ప్రభావం ఉండదనే అంచనాలు బలపడుతూ, తుఫాన్ బలహీనపడుతుండడం కొంత సానుకూల సంకేతమనే చెప్పాలి.
Also Read : Jawad Cyclone – ముంచుకొస్తున్న “జవాద్” అధికార యంత్రాంగం అప్రమత్తం