గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ప్రజలెవరూ మరిచిపోలేరు, ఎందుకంటే అలాంటి హామీలు మరి. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనమంతా వెనక్కి తెప్పించి.. ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేయిస్తానని మోడీ నాటి ఎన్నికల ప్రచారంలో ప్రామిస్ చేశారు. అయితే అది ఎప్పుడో తూచ్ అనేశారు అనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు ఆ హామీ నిజమనుకుని ఒక రైతు అనుకోకుండా చిక్కుల్లో పడ్డాడు. 15 లక్షలు పడడంతో మోడీ హామీ నెరవేర్చాడు అనుకుని వాటిని ఖర్చు చేసి చిక్కుల్లో పడ్డాడు.
అసలు ఏం జరిగిందంటే మహారాష్ట్ర ఔరంగాబాద్ పైఠాన్ తాలూకా దావర్వాడీ గ్రామానికి చెందిన రైతు ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే కొంతకాలం క్రితం మామూలుగా నెలవారీ బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేయడానికి వెళ్లగా అందులో ఉన్న బ్యాలెన్స్ చూసి షాక్ అయ్యాడు. జీరో బ్యాలెన్స్ జన్‌ధన్ ఖాతాలో తాను ఏమీ వేయకుండానే 15లక్షలు ఉండడంతో ముందు టెన్షన్ పడ్డా ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద తెరిచిన ఖాతా కావడం, ప్రధాని చెప్పిన 15 లక్షల హామీ రెండూ సరిపోయాయి. దీంతో ఈ డబ్బంతా మోడీనే తన ఖాతాలో జమ చేశారని భావించిన ధ్యానేశ్వర్ గాల్లో తేలిపోయాడు.
వెంటనే ప్రధాని కార్యాలయానికి ఎన్నికల హామీని నెరవేర్చి, తన ఖాతాలో రూ.15లక్షల జమ చేసినందుకు మోడీకి ధన్యవాదాలు చెబుతూ ధ్యానేశ్వర్ మెయిల్ కూడా పంపాడు. అంతేకాదు తన ఖాతాలో సొమ్ము నుంచి రూ.9 లక్షలు తీసి ఓ చిన్న ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన రూ.6 లక్షలు అలానే ఉంచాడు. అలా ఉండగా ధ్యానేశ్వర్ కి ఓ లేఖ అందింది. “జిల్లా పరిషత్ నుంచి పింపల్వాడీ అనే గ్రామ పంచాయతీకి జమ కావాల్సిన నిధులు పొరపాటున మీకు వచ్చాయి. ఆ డబ్బు మొత్తాన్ని సత్వరమే తిరిగి చెల్లించాలి” అని లేఖలో ఉండడంతో చదివిన అతను ఖంగుతిన్నాడు. ఖాతాలో మిగిలి ఉన్న రూ.6 లక్షలు ఇచ్చినా ఇంటి కోసం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.9 లక్షలు ఎలా ఇవ్వాలని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇల్లు కట్టేందుకు చాలా రోజులు పట్టిందని అన్ని రోజులు ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టలేదని ప్రశ్నిస్తున్నాడు.
Also Read : పోలీసుల మీద దాడులకు దిగుతున్న నిందితులు