iDreamPost
android-app
ios-app

జనతా కర్ఫ్యూ 14 కాదు.. 24 గంటలు..

జనతా కర్ఫ్యూ 14 కాదు.. 24 గంటలు..

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ తెలంగాణలో 24 గంటల పాటు జరగనుంది. ప్రధాని మోదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని కోరగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దాన్ని 24 గంటలకు పొడిగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేపు ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు బంద్‌ పాటించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు.

రేపు ఆదివారం పండ్లు, కూరగాయలు, మెడికల్‌ దుకాణాలు, పెట్రోల్‌ దుకాణాలు తెరిచేందుకు మాత్రమే తెలంగాణలో అనుమతించారు. మిగతా అన్ని సేవలు బంద్‌ కానున్నాయి. ఆర్టీసీ, మెట్రోలు బంద్‌ చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి బస్సులను సోమవారం ఉదయం ఆరు గంటల వరకు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఒకవేళ వస్తే.. బార్డర్‌ వద్దే ఆపేస్తామని హెచ్చరించారు. చిన్న పిల్లలు, పెద్దలు రెండు, మూడు వారాల పాటు బయటకు రావద్దని కేసీఆర్‌ సూచించారు.

విదేశాల నుంచి వచ్చిన వారు స్వతహాగా రిపోర్టు చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు. ప్రభుత్వం ఖర్చులతో వారికి వైద్య సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. వెల్లడించకపోతే.. వారితోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రమాదమని హెచ్చరించారు.

కరోనా జబ్బు స్వాభిమానం ఉన్న జబ్జు.. మనం పిలిస్తేనే వస్తుంది. లేదంటే రాదు. కాబట్టి ఏం చేయాలో ప్రజలే నిర్ణయించుకోని స్వియ నియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో చెప్పారు. ఈ రోజు ఇలా ఉంది.. రేపు ఎలా ఉంటుందో తెలిదన్న కేసీఆర్‌.. నియంత్రణ పాటించడమే మనం చేయగలిగిన పని అన్నారు.

ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు ఇంటింటికి రేషన్‌ బియ్యం ఇచ్చేందుకు ఏలాంటి ఏర్పాట్లు చేయాలో ఆలోచిస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. వాహనాలు, సిబ్బంది, ఇతర ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. కూలీలు, కార్మికులు ఒక్క రోజు ఇంటికే పరిమితం అవ్వాలన్నారు. పని మనుషుల లేదనుకోకుండా.. ధనవంతులు తమ పనిని తామే చేసుకోవాలని సూచించారు.