Idream media
Idream media
ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ సభ్యత్వ నమోదుపై బాగా దృష్టి పెడుతున్నాయి. సభ్యులను అధికంగా పెంచుకుని వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీని ఢీ కొట్టాలంటే విపక్షాలకు ప్రస్తుతం ఉన్న బలం సరిపోదు. ఎందుకంటే.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో కూడా ఆ పార్టీ పాతుకుపోతోంది.
దశాబ్దాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఉనికి కోల్పోతోంది. ఇటువంటి క్రమంలో జనసేన లాంటి పార్టీకి మరింత కష్టమే. అందుకే బీజేపీతో జతకట్టిన ఆ పార్టీ.. ఇప్పుడు సభ్యత్య నమోదుపై దృష్టి సారించింది.
క్రియాశీల సభ్యత్వ నమోదుపై జనసేన పార్టీ ఫోకస్ పెట్టింది. దీనికోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన ఆయన.. జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా చూడాలని పేర్కొన్నారు… పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతోందని వెల్లడించిన పవన్ కల్యాణ్.. పార్టీని మరింత బలోపేతం చేసేలా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలన్నారు..
గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్న వారికిి భీమా సౌకర్యం కల్పించామని.. లక్షమందికి భీమా సౌకర్యం వర్తింపచేశామని.. చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని ఈ సందర్భంగా గుర్తుచేసిన పవన్ కల్యాణ్.. పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ జనసేనాని పంపిన వీడియో సందేశానికి స్పందించిన జనసైనికులు సభ్యత్వ నమోదుకు కసరత్తు చేస్తున్నారు. కథానాయకుడిగా యువతలో బాగానే ఫాలోయింగ్ పొందిన పవన్ కల్యాణ్.. మరి రాజకీయ నాయకుడిగా ఈసారైన గుర్తింపు పొందుతారా, లేదా చూడాలి.
Also Read : సినిమా టికెట్ల ధరలపై తాజాగా భేటీ.. ఏం చర్చించారంటే..