iDreamPost
iDreamPost
అయ్య వచ్చినప్పుడే అమావాస్య అన్నట్టు ఉంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి. రాజకీయాలు అంటే పార్ట్‌టైమ్ జాబ్‌గా పరిగణించే ఆయన తీరిక దొరికినప్పుడు కాలక్షేపం వ్యవహారంలా పార్టీ అధ్యక్షుడి పాత్ర పోషిస్తుంటారు. కొంత సినిమా అయిపోయిన తర్వాత థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకుడు పక్కవాడిని ఇప్పటి దాకా ఏం జరిగింది? అని అడిగినట్టు ఉంటుంది ఆయన రాజకీయం. రాష్ట్రంలో వర్తమాన పరిస్థితులపై అవగాహన, ప్రజా సమస్యలపై అధ్యయనం లేకుండా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధిస్తుంటారు. తమది ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అని చెప్పుకుంటారు కనుక ఆ మాత్రం ప్రశ్నించడమే గొప్ప విషయంగా ఆయన అభిమానులు భావిస్తుంటారు. షూటింగుల్లో విరామమో? ఏమిటో! తెలియదు గాని రెండ్రోజులుగా ప్రభుత్వాన్ని పవన్ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం లేదు? ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదు? మెగా డీఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారు. 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుంది? ఇవీ ఆయన ప్రశ్నలు.
ఇది ఉద్యోగాల కల్పన కాదా?
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పవన్ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రావడంతోనే గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి లక్షా యాభై వేల ఉద్యోగాలను, 2.50 లక్షల వలంటీరు పోస్టులను భర్తీ చేసింది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వచ్చే జూన్‌లో ముగిసి వారు పర్మినెంట్ ఉద్యోగులు కాబోతున్నారు. కరోనా సంక్షోభ సమయంలో యుద్ధ ప్రాతిపదికన వైద్యారోగ్యశాఖలో 45 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఒకేసారి 51 వేల మంది కార్మికులను జగన్ సర్కార్ పర్మినెంట్ చేసింది. జాబ్ కేలండర్ ప్రకటించి విభాగాల వారీగా ఖాళీ అవుతున్న పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. కోర్టు తీర్పునకు అనుగుణంగా 2008 డీఎస్సీలో క్వాలిఫై అయి మిగిలిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చింది. చనిపోయిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు జాబ్ ఇస్తూ కారుణ్య నియామకాలు చేపడుతోంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపడదామనుకుంటున్న తరుణంలో కరోనా అన్ని వ్యవస్థలను దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఊపిరాడని పరిస్థితి కల్పించింది. ఉన్న ఉద్యోగాలే ఊడిపోయి అనేకమంది నిరుద్యోగులుగా మారిపోయారు. అలాంటి సంక్షోభ సమయంలో సామాన్యులు రోడ్డున పడకూడదని సంక్షేమ పథకాల ద్వారా నేరుగా వారికి లబ్ధి చేకూర్చింది. ఇప్పటివరకు 1.26 లక్షల కోట్లు వారి ఖాతాలకు జమ చేసింది. కరోనా దెబ్బకు ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోవడం, ఆ మహమ్మారిని ఎదుర్కొవడానికి భారీగా వ్యయం చేయడం వల్ల సుమారు రూ.30 వేల కోట్ల మేరకు ప్రభుత్వానికి ఊహించని ఖర్చు వచ్చిపడింది. దీంతో సహజంగానే ప్రభుత్వం తను అనుకున్న ప్రణాళికలను అమలు చేయలేక ఉద్యోగాల భర్తీని వాయిదా వేయాల్సి వచ్చింది.
బాబును, కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరు?
రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఇవి కాగా సడన్‌గా తెరపైకి వచ్చి ప్రశ్నలు సంధిస్తున్న పవన్ తన మిత్రుడు చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ఎప్పుడైనా ప్రశ్నించారా? అని వైఎస్సార్ సీపీ నేతలు అడుగుతున్నారు. టీడీపీ పాలనలో శాఖల వారీగా రిటైర్మెంట్‌ల వల్ల ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఉన్నవారిపైనే పనిభారం వేసిన విషయం మీకు తెలియదా? పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తే సరిగా పనిచేయరు. కాంట్రాక్టు ప్రాతిపదికనే నియామకాలు ఉండాలని సెలవిచ్చిన చంద్రబాబును ఇదేం పద్ధతి అని ఎందుకు ప్రశ్నించలేదు. రైల్వే ప్రాజెక్టులకు మ్యాచింగ్ గ్రాంట్ విడుదలపై ప్రశ్నిస్తున్న పవన్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తన మిత్రపక్షమైన బీజేపీ అక్కడ అధికారంలో ఉన్నా ఎందుకు ప్రశ్నించరు? అని అధికార పార్టీ నాయకులు పవన్‌ను అడుగుతున్నారు.
Also Read : కాపు రిజర్వేషన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ.. లక్ష్యం అదేనా..?