iDreamPost
iDreamPost
గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయిన పవన్ కళ్యాణ్ పరువు కోల్పోయారు. దాంతో ఈసారి ఏదో విధంగా గట్టెక్కాలని ఆయన యోచిస్తున్నారు. కాపులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో గడిచిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎంచుకుని ఆయన ఖంగుతిన్నారు. పార్టీ బలాన్ని అంచనా వేయడంలో గతి తప్పిన జనసేనాని జనాదారణ దక్కించుకోలేకపోయారు. చివరకు గాజువాకతో పాటుగా భీమవరంలో కూడా ఓటమి పాలుకావడం జనసేన పార్టీ మీదనే ప్రభావం చూపింది. రాష్ట్రంలో దక్కిన ఒక్క సీటు కూడా నిలబెట్టుకోలేక చతికిలపడింది. రాజోలులో గెలిచిన జనసేన ఎమ్మెల్యే ఇప్పటికే జగన్ కి జై కొట్టడంతో పవన్ పార్టీకి అడ్రస్ కూడా లేనట్టయ్యింది.
వచ్చే ఎన్నికల్లో మాత్రం పగడ్బందీగా వ్యవహరించాలని పవన్ ఆలోచిస్తున్నారు. అందుకోసం తగిన స్థానం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఏపీలో ఎన్నికలు ముందస్తుగా వచ్చినప్పటికీ దానికి సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఇప్పటి నుంచే తగిన నియోజకవర్గం అన్వేషించే పనిలో పడ్డారు. గతంలో అన్నయ్య చిరంజీవి పాలకొల్లులోనూ తర్వాత తమ్ముడు పవన్ భీమవరంలోనూ ఓటమి పాలుకావడంతో పశ్చిమ సెంటిమెంట్ పనిచేయడం లేదని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. అప్పట్లో అన్నయ్య తిరుపతిలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినా పవన్ కి అలాంటి అదృష్టం కూడా గాజువాక వాసులు ఇవ్వలేదు. ఈ లెక్కన వచ్చే ఎన్నికలకు గతంలో బరిలో దిగిన రెండు సీట్లు వదిలేయాలని సంకల్పించారు. విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రమయితే గాజువాక తనకు అనుకూలిస్తుందనే భావన ఆయనలో ఉంది. కార్మికులకు అండగా నిలవడం ద్వారా గాజువాక ఇండస్ట్రీయల్ ఏరియాలో పట్టు సాధించాలనే సంకల్పంతో ఉన్నారు.
Also Read : భీమవరం రాజుల కోరిక నెరవేరుతుందా, మళ్లీ 20 ఏళ్లకు అవకాశం దక్కుతుందా..?
గాజువాక ఈసారి తనకు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. కానీ స్థానికంగా అందుబాటులో ఉండరనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉండడంతో ఏమవుతుందోననే భయం కూడా జనసేనను వెంటాడుతోంది. దాంతో సేఫ్ జోన్ కోసం వేట మొదలయ్యింది. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ లేదా రాజమండ్రి నగరాలను ఆనుకుని ఉన్న రూరల్ నియోజకవర్గాల్లో ఒక సీటు శ్రేయస్కరం అని ఇటీవల ఓ సర్వేలో తేలినట్టు సమాచారం. కాకినాడ రూరల్ లో మంత్రి కన్నబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజమండ్రి రూరల్ సీటులో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వరుసగా రెండు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో జనసేన గెలిచిన జెడ్పీటీసీ స్థానాల్లో కడియం కూడా ఉంది. కాబట్టి రాజమండ్రి రూరల్ వైపు పవన్ కన్నేసినట్టు కనిపిస్తోంది. అదే జరిగితే ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ కి ఎసరు పెట్టడం ఖాయం. అదే సమయంలో కాకినాడ రూరల్ వైపు మొగ్గుచూపితే మాత్రం మరో సీనియర్ నేత పంతం నానాజీకి కష్టమొస్తుంది. ఈ ఇద్దరూ ప్రస్తుతం జనసేనలో కీలక బాధ్యతల్లో ఉన్నారు
పవన్ తూర్పు నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం పిఠాపురం లేదా ఈ రెండు రూరల్ స్థానాల్లో ఏదోటి ఎంచుకోవడం ఖాయం. గాజువాకతో పాటుగా వీటిలో ఒకటి ఎంచుకుంటారా లేక కేవలం ఒక్క స్థానానికే పరిమితం అవుతారా అనేది కూడా స్పష్టత లేదు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో నాదెండ్ల మనోహర్ పర్యటన సందర్భంగానూ ఆయా స్థానాల పరిస్థితి మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిసింది. పవన్ నేరుగా పోటీ చేస్తే ఎలా ఉంటుందోననే అభిప్రాయం కూడా కొందరి వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏమయినా పవన్ రాజకీయ ఆరంగేట్రం చేసి పదేళ్లు, సొంత పార్టీ పెట్టి ఏడేళ్లు దాటినా ఇంకా సొంతంగా ఒక్క సురక్షితమైన నియోజకవర్గం కూడా లేకపోవడం ఆశ్చర్యకరంగానే ఉంది.
Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ – పవన్ దీక్ష