ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై జనసేన ఎమ్మెల్యే రాపాకా వరప్రసాద్ మరోసారి ప్రశంశల వర్షం కురిపించాడు. ఈరోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించిన అనంతరం రాపాక మీడియా తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి 3 రాజధానుల ప్రాతిపాదనకు తాను మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. రాజధాని రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని రాపాక ప్రశంశల వర్షం కురిపించాడు.
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ గా ఉన్నప్పుడు ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందడంతో పాటు ఉమ్మడి రాష్టం తాలూకు నిధులన్నీ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందడానికే వెచ్చించడం జరిగిందని, రాష్ట్ర విభజనలో హైద్రాబాద్ ని కోల్పోవడంతో ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయిందని, రాష్ట్రం ఇప్పడు ఆర్ధికంగా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని, ఈ పరిస్థితుల్లో నిధులన్నీ తీసుకుపోయి రాజధాని కి వెచ్చిస్తే మళ్ళి ప్రాంతాల మధ్య అసమానతలు వచ్చే ప్రమాదం ఉందని అందుకునే ప్రత్యామ్న్యాయంగా 3 ప్రాంతాలను సామానంగా అభివృద్ధి చేస్తే భవిష్యత్ లో ఎటువంటి సమస్యలు ఉండవని రాపాక స్పష్టం చేశారు.
ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతవారం రాజధాని గ్రామాల్లో పర్యటించి రాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతు పలుకుతూ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేసిన తరుణంలో అదే పార్టీ కి చెందిన ఏకైక శాసనసభ్యుడు రాపాక వర ప్రసాద్ 3 రాజాధానుల ప్రతిపాదనకు మద్దతు పలకడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
రాపాక ఇలా అధినేత పవన్ కళ్యాణ్ తో విభేదించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కాలంలో చూస్తే అసెంబ్లీలో సంక్షేమ పధకాలు, ఇంగ్లిష్ మీడియం వంటి అంశాలపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలని ప్రశంసించడమే కాకుండా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కి మద్దతు తెలపడం జరిగింది. కాగా 3 రాజధానుల అంశంలో త్వరలోనే ప్రభుత్వం అఖిల పక్ష సమావేశంనిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాపాక తాజా వ్యాఖ్యాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి