Idream media
Idream media
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు సంబంధించి ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న జనసేన పార్టీ ఒక్కసారిగా స్పీడ్ పెంచింది. రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో కలిసి వెళుతూనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని జనసేన పార్టీ ఏకరువుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రైవేటీకరణ నిర్ణయం బహిర్గతం అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్థిస్తామని చెప్పిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… ఆ తర్వాత పార్టీ నేతల ఒత్తిడితో వెనక్కి తగ్గారు. రాజకీయంగా కూడా జనసేన పార్టీకి ఇది ఉత్తరాంధ్రలో బాగా మైనసయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
ఇక విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పవన్ కళ్యాణ్ విశాఖలో ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా విమర్శించకుండా… కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించి సభను ముగించారు. ఇక ఇప్పుడు మంగళగిరిలో సోమవారం నాడు పవన్ కళ్యాణ్ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకోవడం, దీనికి సంబంధించి జనసేన పార్టీ నేతలు అందరూ కూడా ముందుకు రావడం, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా దీక్షలో పాల్గొనడం కాస్త సంచలనమైంది.
అయితే ఈ దీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ చేయబోయే వ్యాఖ్యలకు సంబంధించి కాస్త ఆసక్తి నెలకొనగా భారతీయ జనతాపార్టీ కూడా ఈ దీక్షను జాగ్రత్తగా గమనిస్తోంది. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లిన తర్వాత ప్రజా ఉద్యమాల విషయంలో పెద్దగా ఆసక్తి చూపించని పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో కాస్త వాటి మీద దృష్టి పెడుతున్నారు. ఇటీవల మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ బీజేపీ డిమాండ్లను పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం కూడా కాస్త గట్టిగానే జరిగింది.
ఒకపక్క పవన్ కళ్యాణ్ దీక్ష సంచలనం రేపుతున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేత 2019 ఎన్నికల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పంతం నానాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఏలేరు కాల్వ గేట్లను మూసివేస్తామని ఆయన హెచ్చరించడం గమనార్హం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి తూ.గో జిల్లా రైతులు సంఘీభావం తెలుపుతున్నాం అని ఆయన ప్రకటన చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరిస్తే ఏలేరు కాల్వ గేట్లు మూసేస్తామన్న ఆయన… విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే గతంలో తాము ప్రభుత్వం ఎంతిస్తే…అంత పరిహారం తీసుకుని భూములిచ్చామని గుర్తు చేసుకున్నారు. తమకు తాగు, సాగు నీరుతో ఇబ్బందున్నా.. స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేశామని చెప్పుకొచ్చారు.స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే మా నీటిని విశాఖ ప్రజలకిస్తాం కానీ.. స్టీల్ ప్లాంటుకు ఇవ్వమన్నారు. రోజుకు 300 క్యూసెక్కుల నీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ఆ నీటిని ఆపేస్తే మా జిల్లాలో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు నానాజీ.