ప్ర‌స్తుతానికి క‌లిసి సాగుదాం..ఆ త‌ర్వాతే పూర్తి క‌ల‌యిక‌..!

జ‌న‌సేన భ‌విత‌వ్యంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. బీజేపీ నేత‌ల‌తో ఆపార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ చ‌ర్చ‌లు జ‌రిపారు. ఢిల్లీలో జేపీ న‌డ్డాతో సాగించిన చ‌ర్చ‌ల అనంతరం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఏపీ బీజేపీ వ్య‌వ‌హారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోద‌ర్ చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన విలీనం చేస్తార‌నే ఊహాగానాలు వినిపించాయి. జ‌న‌సేన అధినేత త‌హ‌త‌హ‌లు చూసిన చాలామంది అలాంటి అంచ‌నాల‌కు వ‌చ్చారు.

అయితే ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో విలీనం క‌న్నా ఇద్ద‌రూ క‌లిసి సాగ‌డం ఉత్త‌మ‌మ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు. కొద్దికాలం పాటు క‌లిసి సాగాల‌ని తీర్మానించారు. విజ‌య‌వాడ‌లో సాగించిన ఈ చ‌ర్చ‌ల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌రసింహ‌రావు, రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తో పాటుగా మాజీ కేంద్ర‌మంత్రి పురందేశ్వ‌రి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి వారు పాల్గొన్నారు. జ‌న‌సేన త‌రుపున అధినేత‌తో పాటుగా నాదెండ్ల మ‌నోహ‌ర్, కందుల దుర్గేష్, శివ శంక‌ర్ వంటి వారున్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. అయితే ప్ర‌స్తుతానికి ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుని స్థానిక స‌మ‌రానికి స‌న్న‌ద్ధం కావాల‌ని ఇరుపార్టీలు నిర్ణ‌యించుకున్నాయి. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ- టీడీపీ కూట‌మికి అప్ప‌ట్లో ప‌వ‌న్ మ‌ద్ధ‌తుప్ర‌క‌టించారు. ప్ర‌చారం కూడా నిర్వ‌హించారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే పార్టీతో జ‌త‌గ‌ట్టారు. రాబోయే రోజుల్లో క‌లిసి ప‌య‌నించాల‌ని తీసుకున్న నిర్ణ‌యంలో భాగంగా కొద్దికాలానికి విలీనం వ్య‌వ‌హారం తెర‌మీద‌కు తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఒకేసారి పార్టీ విలీనం అంటే చిరంజీవి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అదే దారిలో ప‌య‌నిస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ముఖ్యంగా అన్న‌య్య కాంగ్రెస్ లో క‌లిస్తే త‌మ్ముడు బీజేపీ కి జై కొట్ట‌డ‌మే త‌ప్ప పెద్ద‌గా తేడా లేద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్ర‌మాదం నుంచి ప్ర‌స్తుతానికి త‌ప్పించాల‌నే ల‌క్ష్యంతో పొత్త నిర్ణ‌యం తీసుకున్నట్టు క‌నిపిస్తోంది. స్థానిక ఎన్నిక‌లు, ఆ త‌ర్వాత ప‌లు కార్య‌క్ర‌మాల్లో క‌లిసి సాగ‌డం ద్వారా ఇరు పార్టీలు ఒక్క‌టేన‌నే అభిప్రాయం క‌లిగించే ఆలోచ‌న‌కు వ‌చ్చారు. అంతిమంగా విలీనం ప్ర‌క‌టించినా పెద్ద విశేషం లేద‌నే విధంగా జ‌నాలు, కార్య‌క‌ర్త‌ల‌ను స‌న్న‌ద్ధం చేయ‌డ‌మే ఈ పొత్తు నిర్ణ‌యం వెనుక అస‌లు ల‌క్ష్యంగా అంచ‌నా వేస్తున్నారు.

ఇప్ప‌టికే మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో కేవ‌లం 0.87 శాతం ఓట్ల‌తో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు స‌హా అంద‌రూ డిపాజిట్లు కోల్పోయిన పార్టీగా ఘోర ప‌రాభ‌వం పొందిన బీజేపీని ప‌వ‌న్ ఆదుకోగ‌ల‌రా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏపీ ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ ఆపార్టీ ప‌ట్ల వ్య‌తిరేక‌త త‌గ్గ‌లేదు. పైగా ఇటీవల దేశ‌వ్యాప్తంగా ప‌డిపోతున్న క‌మ‌లం గ్రాఫ్ కూడా ప్ర‌భావం చూప‌బోతోంది. ఈ నేప‌థ్యంలో ఆరు శాతం ఓట్లున్న జ‌న‌సేన‌, ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ కూట‌మి ప్ర‌భావం ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌భావితం చేయ‌గ‌ల‌రా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా చంద్ర‌బాబు న‌డిపిస్తున్న వ్య‌వ‌హారం అని కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు. తొలుత ప‌వ‌న్ ని క‌మ‌లానికి ద‌గ్గ‌ర చేసి, ఆయ‌న ద్వారా తాను అదే గూటికి చేరాల‌నే ల‌క్ష్యంతో చంద్ర‌బాబు ఉన్నార‌ని కొంద‌రు అంటున్నారు. అదే జ‌రిగితే 2014 నాటి మిత్ర‌బృందం మ‌ళ్లీ ముందుకు వ‌స్తుందా..మ‌నుగ‌డ ఉంటుందా అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.

Show comments