“అధికారానికి జగన్ కొత్త. ఓ ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నా. కాని ఇంత త్వరగా ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతుందనుకోలేదు. ఇసుక కొరతతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు ఉసురు తీసుకోవడం నన్ను కలచివేసింది. దీంతో నవంబర్ 3న విశాఖ లాంగ్ మార్చ్‌కు పిలువు ఇవ్వాల్సి వచ్చింది” అని జనసేన అధినేత పవన్‌కల్యాన్ చెబుతున్న మాటలు.
అబ్బో పేరుకు తగ్గ పార్టీ, మాటలకు తగ్గ నేత మన పవన్‌కల్యాన్ అని చాలా మంది అనుకున్నారు. కానీ అసలు సంగతి వేరే ఉంది. అత్యంత ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌ను ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాదండోయ్. జగన్‌ను ఎదుర్కోవడం తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని పవన్ గట్టిగా నమ్ముతున్నారని తెలిసింది.
ఇదే సందర్భంలో బీజేపీ, టీడీపీలతో కూడిన కూటమిని ఏర్పాటు చేయాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి భవన నిర్మాణ కార్మికుల సమస్యపై పోరాటమే సరైన మార్గమని ఆయన అభిప్రాయపడుతున్నారని తెలిసింది. భవన నిర్మాణ కార్మికుల పేరుతో కూటమి నిర్మాణం చేయాలనే ఆలోచనకు బీజేపీ-టీడీపీ కూడా సుముఖంగా ఉన్నారని తెలిసింది.
ఎందుకంటే పవన్‌కు యూత్‌లో కొంతమేరకు ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలంటే అందరూ కలిస్తేనే సాధ్యమని ఏపీలో బలపడాలని తహతహలాడుతున్న బీజేపీ నమ్ముతోంది. అందుకే పవన్ లాంగ్‌మార్చ్‌కు బీజేపీ ఇప్పటికే సంఘీభావం ప్రకటించింది. ఇక మీ వంతే అన్నట్టు తెలుగుదేశానికి పవన్ ఆహ్వానం పలుకుతున్నారు.
నీకు పెళ్లాం లేదు, నాకు మొగుడు లేడనే చందంగా టీడీపీ-జనసేనల రాజకీయ పరిస్థితులున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలు సమస్యల ప్రాతిపదిక పేరుతో కలవడం పెద్ద పనికాదు. దీనికి అంకురార్పణ విశాఖ లాంగ్‌మార్చ్ వేదిక కావడం పక్కా. రాజకీయాలన్నాక ఏదీ చెప్పి చేయరు. యువతీయువకుల మధ్య పరిచయం ప్రేమగా మారినట్టు…రాజకీయ పార్టీల మధ్య సమస్యల ప్రాతిపదికన ఏర్పడిన స్నేహ బంధాలు ఎన్నికల సమయంలో పొత్తులకు దారి తీస్తాయి. భవన నిర్మాణ కార్మికుల సంగతేమో గాని వారి పేరుతో మహాకూటమి నిర్మాణం ఏర్పడడం తథ్యమనిపిస్తోంది.
–Sodum ramana