iDreamPost
android-app
ios-app

జమ్మలమడుగు లెక్కలు ఇంత త్వరగా మారిపోయాయే ..!

జమ్మలమడుగు లెక్కలు ఇంత త్వరగా మారిపోయాయే ..!

మున్సిపల్ ఎన్నికల్లో అందరూ ఊహించిన ఫలితాలే వెల్లడయ్యాయి. జనరల్ ఎలెక్షన్ కంటే అధికార వైసీపీ ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకోగా, ప్రతిపక్ష టీడీపీ ఉన్న ఓటర్లని కూడా కోల్పోయింది.

కడప జిల్లాలో ఆసక్తి కలిగించిన మున్సిపాలిటీల్లో జమ్మలమడుగు ఒకటి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న మాజీమంత్రి ఆది నారాయణరెడ్డి 29 పంచాయతీలను గెలిపించుకున్నారు. దీనితో ఇదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగిస్తారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొనివున్నింది. ఆది కూడా వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ మున్సిపాలిటీ అత్యధిక వార్డులు గెలుచుకుంటామని సవాల్ చేస్తూ వచ్చాడు.

అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని … అన్న చందాన నిన్న(ఆదివారం) వెల్లడైన ఫలితాల్లో బీజేపీ బొక్క బోర్లా పడింది. మొత్తం 20 వార్డుల్లో 2 వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన 18 వార్డులకు జరిగిన పోలింగ్ లో కేవలం 2 వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. 9వ వార్డుని 31 మెజారిటీ తో, 16వ వార్డుని 90 మెజార్టీతో బొటాబొటిగా గెలుచుకుంది.

పచ్చని గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తాడనే భయం వల్లే గ్రామ ఓటర్లు ఆది వర్గానికి మొగ్గుచూపారు. అయితే పట్టణానికి వచ్చే సరికి ఆది పప్పులు ఉడకలేదు. మరోవైపు తాడిపత్రి లో జేసీ ప్రభాకర్ రెడ్డి .. పెద్దారెడ్డి తో డీ అంటే ఢీ అన్నట్లు పోరాడి మున్సిపాలిటీ లో అత్యధిక వార్డులు గెలుచుకున్నారు. వార్డు అభ్యర్థులకు ధైర్యం చెప్పేందుకు తాను కూడా కౌన్సిలర్ గా పోటీలో నిలిచారు. కానీ, ఆది విషయానికి వస్తే పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపించింది. దేవగుడి పల్లెలో కూర్చొని చేసిన రాజకీయం పూర్తిగా బెడిసికొట్టింది. ఈ ఫలితాలను చూపి బీజేపీ అధిష్టానం వద్ద మెప్పు పొందుదామని చూసిన ఆయన ఆశలు అడియాసలయ్యాయి.

ఇదిలా ఉండగా జమ్మలమడుగు లో గెలిచిన 18 మంది కౌన్సిలర్లను వైసీపీ క్యాంప్ కి తరలించింది. ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తీసుకెళ్లింది. చైర్ పర్సన్ గా జమ్మలమడుగు పట్టణంలో సుప్రసిద్ధ వైద్యుడు డాక్టర్. రామేశ్వరుడి సతీమణి వేల్పుల శివమ్మ 18వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనుంది. చైర్ పర్సన్ బీసీ మహిళకు దక్కడంతో వైస్ చైర్మన్ పదవిని ఎవరికి ఇస్తారో అన్న ఆసక్తి నెలకొంది. 18 మందిని గెలిపించుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎవరి పేరుని సెలెక్ట్ చేస్తే వాళ్లకే అదృష్టం వరించనుంది.