iDreamPost
android-app
ios-app

‘జమిలి’ దిశగా దూకుడు పెంచుతున్న బీజేపీ

‘జమిలి’ దిశగా దూకుడు పెంచుతున్న బీజేపీ

ఒకే దేశం – ఒకే ఎన్నిక నినాదం అందుకున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. మద్దతు కూడగట్టుకునే క్రమంలో భాగంగా వెబినార్‌లు ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా 25 వెబినార్‌ లు నిర్వహించి జమిలి ఎన్నికలపై అందరికీ అవగాహన కలిగించాలని భావిస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. నాటి నుంచీ తెలుగు రాష్ట్రాల సహా పలు రాష్టా్ట్రలలో ఈ ప్రస్తావన జోరుగా సాగుతోంది. ఇటీవలే సీఈసీ సైతం దేశమంతటా లోక్‌సభ, శాసనసభలకు జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా ప్రకటించారు. దీంతో జమిలి ఎన్నికలు 2024లో సార్వత్రిక ఎన్నికలతోపాటు జరుగుతాయా, లేక ముందే జరుగుతాయా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు ప్రారంభమయ్యాయి.

జోరుగా ఆన్‌లైన్‌ సమావేశాలు

దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలంటున్న బీజేపీ.. దీనికి వివిధ వర్గాల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ నినాదంతో వెబినార్‌లు నిర్వహించనుంది. ఈ నెలాఖరులోగానే 25 వెబినార్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశాల్లో పార్టీ సీనియర్‌ నేతలు, వివిధ సంస్థల సభ్యులు, న్యాయకోవిదులు పాల్గొననున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే జమిలి ఎన్నికల అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఎప్పుడూ ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని, ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ దిశగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలోనూ ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వెబినార్‌ల నిర్వహణకు పూనుకుంది. లా కమిషన్‌ కూడా ఇప్పటికే ఈ మేరకు కేంద్రానికి ముసాయిదా నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని 83(2), 172(1) అధికరణలు లోక్‌సభ, శాసనసభల కాలపరిమితిని నిర్దేశించాయి. రద్దు చేయనంతవరకూ ఈ సభలు ఐదేళ్ల కాలపరిమితి వరకు కొనసాగుతాయని ఈ అధికరణలు పేర్కొన్నాయి. అయితే ఈ సభల కాలపరిమితిని పొడిగించాలంటే మాత్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. లోక్‌సభ, శాసన సభలను కాలపరిమితికి ముందే రద్దు చేసేందుకు ఎటువంటి రాజ్యాంగపరమైన అడ్డంకి లేదని, కానీ.. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన సందర్భాల్లో మాత్రమే 356 అధికరణను ఉపయోగించాల్సి ఉంటుందని వారు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి