iDreamPost
android-app
ios-app

జై ఆంధ్రా ఉద్య‌మంలో హుండి దొంగ‌లు

జై ఆంధ్రా ఉద్య‌మంలో హుండి దొంగ‌లు

వ‌ర్త‌మానం చీక‌టిగా ఉన్న‌పుడు గ‌తం అనే వెలుతురులోకి దూరిపోతాం. విషాదం ఆవ‌రించిన‌ప్పుడు హాస్యాన్ని వెతుక్కుంటాం. నాట‌కం న‌డుస్తూ వుంది. సుఖాంత‌మో కాదో తెలియ‌దు. ప‌సివాడు త‌ల్లిని అదుముకుని నిశ్చింత‌గా నిద్ర‌లోకి జారిన‌ట్టు నేను గ‌తంలోకి జారిపోతున్నా.

పుట్ట‌మ్మ టీచ‌ర్ నాతో అ ఆ ఇ ఈ దిద్దించింది. అఆలు వ‌డియాల్లా , ఇ అక్ష‌రం కొమ్మ మీద కోతిలా , ఈ ఒక దార‌పు కండెలోంచి దారం వేలాడుతున్న‌ట్టు క‌నిపించేది. ఋ అయితే చుట్ట‌చుట్టిన పాములా భ‌య‌పెట్టేది. ఈ అక్ష‌రాల‌ని జీవిత‌మంతా రాస్తాన‌ని అప్పుడు తెలియ‌దు. రెండో త‌ర‌గ‌తిలో నంద‌య్య అయ్య‌వారు తెల్ల చొక్కా, పంచెతో వ‌చ్చేవాడు. చొక్కాకి, పంచెకి అక్క‌డ‌క్క‌డ చిరుగులుండేవి. బ‌త‌క‌లేని కాలం. ఆయ‌న మేద‌ర‌గేరిలో ఉండేవాడు (గేరి అంటే క‌న్న‌డంలో వీధి అని అర్థం. క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ఇది వాడుక‌లో ఉంది). ప్ర‌తిరోజూ కొత్త బెత్తంతో వ‌చ్చేవాడు. కొట్ట‌డు కానీ జుయ్ జుయ్ అని సౌండ్ చేసేవాడు. ఆ శ‌బ్దానికే ర‌హ‌మ‌తుల్లా అనే వాడు నిక్క‌ర్ త‌డుపుకున్నాడు. వాళ్ల అమ్మ బూబ‌మ్మ బ‌కెట్ నీళ్ల‌తో క్లాస్‌ని శుభ్రం చేయాల్సి వ‌చ్చింది. 4వ త‌ర‌గ‌తిలో శంక‌ర‌య్య అయ్య‌వారు. ఆయ‌న‌కి చేతులే బెత్తాలు. జుత్తు ప‌ట్టుకుని త‌ల వంచి వీపు మీద గుద్దేవాడు.

అప్ప‌ట్లో స్కూల్‌కి టీకాలు వేసేవాళ్లు వ‌చ్చేవాళ్లు. ఒక్క స్ట‌వ్‌, సిరంజీల‌తో య‌మ‌దూత‌ల్లా క‌నిపించే వాళ్లు. వాళ్ల‌ని చూస్తే గుండె కాయ‌లు గ‌డ‌గ‌డ వ‌ణికేవి. ఎవ‌రూ పారిపోకుండా మెయిన్ డోర్ ద‌గ్గ‌ర శంక‌ర‌య్య కాప‌లా. లోప‌ల య‌మ‌దూత‌లు, బ‌య‌ట య‌ముడు …ఇంకేం పారిపోతాం! అయినా వెంక‌టి గాడు అనే ధైర్య‌వంతుడు ఒక‌సారి ప్ర‌య‌త్నించాడు. వాన్ని బాల్‌లా తంతూ శంక‌ర‌య్య లోప‌లికి తోసాడు. ఫ‌స్ట్ వాడికే టీకా వేశారు. వాడి అరుపుల‌కి మిగిలిన వాళ్లు బిక్క‌చ‌చ్చి పోయారు.

నేను అంద‌రి కంటే ఆఖ‌రున కూర్చునేవాన్ని. అయినా నా వంతు వ‌చ్చేది. త‌ప్ప‌నిస‌రైన‌ప్పుడు ముందు మ‌న‌మే త‌లొగ్గాలి. ఆరో త‌ర‌గ‌తిలో సుబ్బ‌నాచారి అయ్య‌వారు ఎపిసోడ్ స్పెష‌ల్‌. లెక్క‌లు చెప్పేవాడు. మొద‌టి రోజు జోకులు చెప్పి న‌వ్వించాడు. ఎంత మంచి అయ్య‌వారో అని మురిసిపోయాం. షోలేలో గ‌బ్బ‌ర్‌సింగ్ మొద‌ట న‌వ్వించి , చివ‌ర్న దొంగ‌ల్ని కాల్చేస్తాడు. ఈయ‌న అదే టైప్‌. త‌ర్వాతి రోజు ఎక్కాలు చెప్ప‌మ‌న్నాడు. 20 × 10=200 వ‌ర‌కూ చెప్పాం. స‌గం మందికి ఇంజ‌న్ ఆగింది. బొత్తిగా ఎక్కాలు రాని వాన్ని బ‌య‌టికి పంపించి రెండు బెత్తాలు తెమ్మ‌న్నాడు. అప్ప‌టి వ‌ర‌కూ ఒక బెత్త‌మే అనుభ‌వం. ఈ బోన‌స్ బెత్తం తెలియ‌దు. వాడు తెచ్చాడు. ఎన్టీఆర్ గులేబ‌కావ‌ళి పువ్వుని అందించిన‌ట్టు అందించాడు. గోడ‌కి త‌ల‌పెట్టి వెన‌క్కి తిరిగి నిల‌బ‌డ‌మ‌న్నాడు. పిర్ర‌లు ప‌గిలిపోయాయి. రెండు బెత్తాలు ఎందుకో అంద‌రికీ అర్థ‌మైంది.

అంద‌రూ చ‌చ్చీచెడి బ‌ట్టి ప‌ట్టారు. దెబ్బ‌లుండ‌వ‌ని అనుకున్నారు. ఇర‌వై ప‌దుల 200తో ఎక్కాలు ఆగ‌లేదు. ఎక్స్‌టెన్ష‌న్ ఇచ్చాడు. 10తో కాకుండా 20 వ‌ర‌కూ చెప్పాలి. అంటే ఉదాహ‌ర‌ణ‌కి 12 × 10=120 తో ఆగే ఎక్కం. 12 ×11 నుంచి మొద‌లై 12 ×20 వ‌ర‌కూ వెళ్లాలి. హాహాకారాలు. నా లాంటి తెలివైన వాళ్లు చ‌చ్చీచెడి నేర్చుకుని హ‌మ్మ‌య్య అనుకున్నాం. కానీ అక్క‌డున్న‌ది సుబ్బ‌న్న‌, అర‌వీర భ‌యంక‌రుడు. హ‌ఠాత్తుగా లేపి 12 × 17 ఎంత అని అడిగేవాడు. నోట్లో లెక్క‌లేసుకునేలోగా పిర్ర మీద సౌండ్ వ‌చ్చి , పూరీ పొంగిన‌ట్టు పొంగేది. కొట్ట‌డంలో కూడా ఆయ‌న‌కో ప‌ద్ధ‌తి ఉండేది. ఎవ‌రిని కొడ‌తాడో ఆయ‌న‌కే తెలియ‌దు. రావ‌డం రావ‌డ‌మే ఎక్కాల సెష‌న్ ఉండేది. అవి చెప్ప‌డం బ్ర‌హ్మ‌దేవుడి వ‌ల్ల కూడా కాదు. రాండ‌మ్‌గా ఐదుగురిని లేపి గోడ‌కు నిల‌బెట్టి ఉతికే వాడు. ప్ర‌తిదానికి విరుగుడు వుంటుంది. ఒకొక్క‌డు 3, 4 నిక్క‌ర్లు వేసుకొచ్చేవాళ్లు. న‌డుముకి ఇబ్బంది కానీ, గాలి బాగానే ఆడేది. దెబ్బ‌లు ప‌డితే నిక్క‌ర్ల మీద దుమ్ము లేచేది కానీ, నొప్పి త‌గిలేది కాదు. అయ్య‌వారికి అనుమానం రాకుండా అమ్మా అబ్బా అని అరిచేవాళ్లు. రెండు రోజుల‌కే ఆయ‌న క‌నిపెట్టి నిక్క‌ర్ మీద కాకుండా పిక్క‌ల మీద వాయించ‌డం స్టార్ట్ చేశాడు.

ఈ హార‌ర్ క్లాస్‌ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని స‌మ‌యంలో కాగ‌ల కార్యాన్ని ఉద్య‌మ‌కారులు తీర్చారు. జైఆంధ్రా ఉద్య‌మం వ‌చ్చింది. స్కూళ్లు బంద్‌. ముల్కి ఉద్య‌మంతో సుబ్బ‌నాచారి బాధ తప్పింద‌నుకున్నాం. కానీ త‌ప్ప‌లేదు. ఈయ‌న ఉద్య‌మంలో Active part. ప్ర‌తిరోజూ నిరాహార‌దీక్ష‌ల‌కి జ‌నాల్ని స‌మీక‌రించేవాడు. రాయ‌దుర్గంలో పెద్ద‌వాళ్లు అయిపోయి పిల్ల‌ల వంతు కూడా వ‌చ్చింది. ఒక‌రోజు దీక్షా శిబిరంలో మ‌మ్మ‌ల్ని తోశాడు. ఉద‌యాన్నే ఇడ్లీలు తిని కూచున్నాం. వ‌చ్చిపోయే జ‌నాల ద‌గ్గ‌ర డ‌బ్బాని సౌండ్ చేసి చిల్ల‌ర వేయించుకున్నాం. శేఖ‌ర్ అనేవాడు హుండీ స్పెష‌లిస్ట్‌. వాళ్ల ఇంట్లో దేవుడి హుండీ ఎప్పుడూ నిండ‌క‌పోవ‌డానికి కార‌కుడు. ఒక పుల్ల‌తో ఉద్య‌మ హుండీకి చిల్లు పెట్టి రూపాయి కొట్టేశాడు. ఒక‌టికి వ‌స్తుంద‌ని చెప్పి , రూపాయితో బ్రెడ్‌, బిస్కెట్లు, పుల్ల ఐస్‌క్రీం తినేసి జై ఆంధ్రా అని వ‌చ్చి శిబిరంలో కూచున్నాం.

సాయంత్రానికి దీక్ష ముగిసింది. సుబ్బ‌నాచారి ప్ర‌త్య‌క్ష‌మై క‌ల‌ర్ సోడాలిచ్చి దీక్ష విర‌మింప‌జేశాడు. మాలో ఒక అతిగాడు ఉండేవాడు. వాడు కొంచెం ఓవ‌రాక్ష‌న్ చేసి భ‌లే నీర‌సంగా ఉంది సార్ అన్నాడు.సుబ్బ‌నాచారి కోపంగా చూసి “లే, దొంగ నా కొడుకుల్లారా, మీరు బ‌స్టాండ్ ద‌గ్గ‌ర బ్రెడ్లు, బిస్క‌త్తులు తినేది చూసినానురా, దుడ్లు యాడివిరా మీకు , హుండీ ఖాళీ చేసినారు క‌దా. స్కూల్ తెరిస్తే మీకుందిరా ఎన్ని బెత్తాలు ఇరుగుతాయో ఏమో” అన్నాడు. మాకు చ‌లిజ్వ‌రం వ‌చ్చింది. రాత్రికి రాత్రి స్కూల్ బిల్డింగ్ ప‌డిపోవాల‌ని, ఇంకో రెండుమూడేళ్లు ఆంధ్రా స్ట్రైక్ జ‌ర‌గాల‌ని దేవున్ని కోరుకున్నాం. కానీ దేవుడెప్పుడూ మ‌న‌కి అపోజిష‌న్‌లో ఉంటాడు. ఉద్య‌మం ముగిసి స్కూళ్లు తెరిచారు.

మూడు నాలుగు నిక్క‌ర్లు వేసుకున్నా లాభం లేదు. కుడుములు ఎక్క‌డ లేస్తాయో తెలియ‌దు. నిస్తేజ నిర్వికార స్థితిలో అపుడ‌ప్పుడు అద్భుతాలు జ‌రుగుతాయి. ప్ర‌భుత్వం వారు కూడా మంచి ప‌నులు చేస్తారు. సుబ్బ‌నాచారి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాడు. ఎండ‌లో మంచువాన‌, మా ఆనందం మామూలుగా లేదు.

ఇది జ‌రిగి దాదాపు 50 ఏళ్లు. క‌ష్టాలు ఎక్కువ రోజులుండ‌వ‌ని నాకు అప్పుడే తెలుసు.