iDreamPost
iDreamPost
పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు. విద్యార్ధి ఫీజు ఎంతైనా సరే, మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. అందుకే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికానికి, 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ అన్నారు.
ప్రతి బిడ్డ చదువుకోవాలన్నదే నా ఆకాంక్ష. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చాం. కుటుంబంలో ఎంతమంది ఉన్నా, అందరినీ చదివించండి. ప్రతి ఇంటి నుంచి ఇంజినీర్లు, డాక్టర్లు, ఐపీఎస్‌లు రావాలి. వారి ఫీజులన్నింటిని భరించి, అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది అని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
అదేజమయంలో పథకాలపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరైతే ఈ పథకాలను గత ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా డీబీటీ ద్వారా పేదలకు నేరుగా సంక్షేమ ఫలాలను అందిస్తున్నాం. గత పాలనతో ఈ పాలనకు తేడాను గమనించండి అని సీఎం జగన్ ప్రజల్ని కోరారు.
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఇప్పటికే రూ.11,715 కోట్లు అందించాం. చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాటు కాకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించాం. అమ్మఒడి, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, బైజ్యూస్‌తో ఒప్పందం, పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. విద్యారంగంపై మూడేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చుపెట్టామని వైఎస్ జగన్ ప్రకటించారు.