iDreamPost
android-app
ios-app

వాక్సిన్ విధానం మీద ఒత్తిడి తీసుకొద్దాం – అన్ని రాష్ట్రాల సీఎంల‌కు జ‌గ‌న్ లేఖ..

వాక్సిన్ విధానం మీద ఒత్తిడి తీసుకొద్దాం – అన్ని రాష్ట్రాల సీఎంల‌కు జ‌గ‌న్ లేఖ..

టీకాల విష‌యంలో కేంద్రం అనుస‌రిస్తున్న విధానాల‌ను తెలియ‌జేస్తూ.. ముఖ్యమంత్రులం అంద‌రమూ ఒకే మాట‌పై నిల‌బ‌డాల‌ని పేర్కొంటూ దేశంలోని అన్నిరాష్ట్రాల సీఎంల‌కు జ‌గ‌న్ లేఖ‌లు రాయ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. కేసుల్లో ఉన్న జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌రంటూ విమ‌ర్శించే ప్ర‌తిప‌క్షాల‌కు మైండ్ బ్లాక్ అయింది. గ‌తంలో న్యాయ వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను ఎత్తిచూపుతూ లేఖ రాసిన జ‌గ‌న్.. మ‌రోసారి ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌లు రాయ‌డం ద్వారా చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

క‌రోనా టీకాల స‌ర‌ఫ‌రా విష‌యంలో ఒకే గొంతుక వినిపించాల‌ని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు వైఎస్ జ‌గ‌న్ లేఖ‌లు రాయ‌డాన్ని మామూలు విష‌యంగా తీసుకోవ‌ద్ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  మోదీ వైఖ‌రిపై జ‌గ‌న్ దిక్కార స్వ‌రాన్ని ఈ లేఖ‌లు ప్ర‌తిబింబిస్తున్నాయి. క‌రోనా క‌ట్ట‌డిలో కేంద్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం, అహంకార‌పూరిత వైఖ‌రిపై జ‌గ‌న్ ధిక్కార స్వ‌రానికి ఈ లేఖ‌లు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. గ్లోబల్‌ టెండర్లు పిలిచినా ఒక్క బిడ్‌ కూడా దాఖలు కాలేదని కేరళ సీఎం పినరయి విజయన్‌కు రాసిన లేఖలో జగన్‌ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ లభ్యతలో త‌లెత్తుతున్న ఇబ్బందులను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రులంతా ఒకే గొంతుక వినిపించాలని ఆయ‌న‌ విజ్ఞప్తి చేశారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని అందరం కోరదామని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్లోబల్‌ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని ప్రస్తావించారు. వ్యాక్సిన్‌ లభ్యత విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా పరిస్థితి మారుతోందని ఆయ‌న పేర్కొన్నారు.

క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయాల‌నే ఆశ‌యంతో విదేశాల నుంచి టీకాలు తెప్పించే క్ర‌మంలో గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌కు వెళ్లాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తెలంగాణ స‌ర్కార్ కూడా ఇదే ప‌ద్ధ‌తిని అనుస‌రించింది. దేశంలోని మ‌రికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే పంథాను అనుస‌రించాయి. అయితే టీకాల‌ను రాష్ట్రాల‌కు ప్ర‌త్యేకంగా స‌ర‌ఫ‌రా చేసేది లేద‌ని, కేవ‌లం దేశానికి మాత్ర‌మే అంద‌జేస్తామ‌ని ఇత‌ర దేశాల కంపెనీలు స్ప‌ష్టం చేశాయి. దీంతో వ్యాక్సినేష‌న్‌ను పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉన్న‌ప్ప‌టికీ ఆయా కంపెనీల‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న ఆదేశాల‌తో అది సాధ్యం కావ‌డం లేదు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ డైరెక్టుగా ఢీ కొడుతున్నారు.