iDreamPost
android-app
ios-app

జ‌గ‌న్ ఉండ‌గా ప‌రిశ్ర‌మ‌కు మంచే జ‌రుగుతుంది : చిరంజీవి

జ‌గ‌న్ ఉండ‌గా ప‌రిశ్ర‌మ‌కు మంచే జ‌రుగుతుంది : చిరంజీవి

దాసరి నారాయణరావు త‌ర్వాత‌.. తానే ముందుకి వచ్చి సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవి పరిశ్రమకోసం మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి సినీ సమస్యల్ని వివరించారు. ఆ తర్వాత సినీ ప్రముఖులతో కూడా వెళ్లి ఏపీ సీఎంని కలిశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై తీసుకున్న నిర్ణయంపై ట్వీట్ కూడా చేశారు. తాజాగా ఇవాళ జగన్ తో మరోసారి సినీ సమస్యలపై చర్చించడానికి వెళ్లారు చిరంజీవి. ఆ విష‌యాల‌ను చెబుతూ.. ఆయ‌న జ‌గ‌న్ స్పందించిన తీరుకు మంత్ర‌ముగ్దుల‌య్యారు. త్వ‌ర‌లోనే తీపి క‌బురు అందుతుంద‌ని, జ‌గ‌న్ ఉండ‌గా ప‌రిశ్ర‌మ‌కు మంచే జ‌రుగుతుంద‌న్న ధీమా వ్య‌క్త‌మైంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

జ‌గ‌న్ తో భేటీ అనంత‌రం చిరంజీవి స్పంద‌న చూస్తే వివాదాల‌కు ఇక ఫుల్ స్టాప్ ప‌డ్డ‌ట్లే అనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ చాలా సంతృప్తికరంగా జరిగిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పరిశ్రమ పెద్దగా కాకుండా బిడ్డగా సినీ పరిశ్రమ కష్టాలను జగన్‌ ముందు ఉంచడానికి వచ్చానని ఆయన తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ను చిరంజీవి కలిశారు. దాదాపు గంటన్నర సాగిన ఈ భేటీలో సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

‘‘ఈ సమావేశం ఎంతో సంతృప్తికరంగా సాగింది. సీఎం నన్ను ఓ సోదరుడిలా పండగవేళ ఆహ్వానించి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన మాట తీరు బాగా నచ్చింది. భారతిగారు స్వయంగా భోజనం వడ్డించడం ఆనందంగా అనిపించింది. కొద్ది రోజులుగా సినిమా టికెట్‌ ధరల విషయంలో ఒక మీమాంస ఉంది. దీని వల్ల పరిశ్రమలో అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే అసంతృప్తి ఓ వైపు.. ఇండస్ట్రీకి మంచి చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెబుతున్న ప్రభుత్వం ఒక వైపు. పరిష్కారం దొరకని ఈ సమస్య రోజురోజుకి పెద్దది అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ప్రత్యేకంగా నన్ను పిలిచారు. ఒక సమస్య గురించి నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలోనే వినటంకాదు రెండో కోణంలోనూ వినాలని అన్నారు. ‘మీరు వచ్చిన సమస్యలను వినిపిస్తే దానిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు అని ఆయన నాతో అన్న మాటలకు నాపై పెట్టిన నమ్మకం, భరోసా ఎంతో బాధ్యతగా అనిపించింది’’ అని అన్నారు.

‘‘సామాన్య ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే ఆయన ప్రయత్నాన్ని అభినందిస్తూ, పరిశ్రమలో ఉన్న సాధక బాధకాలు, ఎగ్జిబిషన్‌ రంగంలో థియేటర్‌ యజమానులు పడుతున్న కష్టాలను ఆయనకు వివరించాను. ఆయన సానుకూలంగా స్పందించారు. వీటి అన్నింటినీ పరిగణలోకి తీసుకుని, కమిటీతో మాట్లాడి పరిశ్రమకు మంచి జరిగేలా ఓ నిర్ణయం తీసుకుంటామని మాటిచ్చారు. పేద కార్మికులకు మంచి చేస్తానని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌రంగంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. థియేటర్లు మూసి వేయాలనే అభద్రతా భావం కూడా ఉంది. ఈ సమస్యలు అన్నింటిని జగన్‌ ముందు ఉంచాను. అన్నింటినీ ఆయన అవగాహన చేసుకున్నారు.

అన్ని కోణాల్లోనూ ఆలోచించి అందరికీ మంచి జరిగేలా నిర్ణయం తీసుకుని జీవో పాస్‌ చేస్తామని ధైర్యం కల్పించేలా మాట్లాడారు. ఆయన ఇచ్చిన భరోసాతో ఎనలేని ధైర్యం ఏర్పడింది. దయచేసి పరిశ్రమకు సంబంధించిన ఎవరూ కూడా మాటలు జారవద్దు. నా మాట మన్నించి సంయమనం పాటించండి. వారం, పది రోజుల్లో అందరికీ ఆమోదంగా ఉండే జీవో వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఆయనతో జరిగిన చర్చ మొత్తాన్ని మా ఇండస్ట్రీకి సంబంధించిన అందరికీ తెలియజేస్తానని, వారేమన్నా సలహాలు ఇస్తే వాటిని కూడా తర్వాతి మీటింగ్‌లో మీ ముందు ఉంచుతాను’’ అని జగన్‌తో చెప్పిన‌ట్లు పేర్కొన్నారు.

వెల్ క‌మ్ ఆచార్య‌..

చిరంజీవి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్ల‌గానే ఆయ‌న‌కు ఎదురెల్లి జ‌గ‌న్ స్వాగతం పలికారు. చిరంజీవిని చూడగానే ‘రండి ఆచార్య.. వెల్‌కమ్ ఆచార్యా’ అంటూ జగన్ ఘన స్వాగతం పలికారు. దీంతో చిరంజీవి పులకించిపోయారు. చిరంజీవికి జగన్ లంచ్ ఏర్పాటు చేశారు. భోజనం చేస్తూ సినిమా టికెట్ల ధరలపై చర్చించారు. ఇద్దరూ గంటకు పైగా చర్చించారు. భేటీ అనంతరం గన్నవరం విమానాశ్రయం వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడారు. పండగ పూట విందుకు పిలిచి ఆప్యాయంగా మాట్లాడారని, అలాగే జగన్ సతీమణి భారతి దగ్గరుండి వడ్డించడం చాలా ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. తిరిగి అపాయింట్‌మెంట్ ఎప్పుడు అని అడగ్గా.. ‘ఎప్పుడంటే అప్పుడు భోజనానికి వచ్చేయండన్నా’ అని జగన్ అన్నారని చిరంజీవి తెలిపారు. జగన్‌ ఆహ్వానం మేరకే ఆయనతో భేటీ అయ్యానని, ఆ భేటీ సంతృప్తికరంగా జరిగిందని తెలిపారు. జగన్ తనకు సోదర సమానుడని, సీఎం దంపతుల ఆతిథ్యం ఎంతో బాగుందని ప్రశంసించారు.