Idream media
Idream media
వ్యాక్సిన్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. దేశమంతా కరోనాను కట్టడి చేసే ఏకైక ఆయుధం వ్యాక్సిన్ అని నమ్ముతోంది. వ్యాక్సిన్ కోసం ఉత్పత్తి కంపెనీలపై కేంద్రంతో పాటు, ఆయా రాష్ట్రాలు కూడా ఒత్తిడి చేస్తున్నాయి. ఇదిలాఉండగా, ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసే వెసులుబాటును ఇటీవల కేంద్రం కల్పించింది. ఆ నిర్ణయం కారణంగా మార్కెట్లో పోటీతత్వం పెరిగే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. వాక్సిన్ల ధరల్లో తేడాలు, ఏ రేటుకు వాక్సిన్ వేయాలన్న దానిపై ప్రైవేటు ఆస్పత్రులకు వెసులుబాటు కల్పించడం కారణంగా, కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రజలపై భారం వేయడమే కాదు, సామాన్యులు వ్యాక్సిన్ కు దూరం కావాల్సిన భయంకర పరిస్థితులు రావొచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
కొవిడ్ కాలం మొదలైనప్పటి నుంచీ నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ జగన్ టాక్ ఆప్ ద కంట్రీగా మారారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని మొట్టమొదటిగా చెప్పినవారు జగన్. అనుకున్నంత తర్వగా అయ్యే పని కాదని, వ్యాక్సినేషన్ విషయంలో కుండబద్దలుకొట్టినట్లు చెప్పారు. అలాగే ఇప్పుడు కేంద్రం నిర్ణయం కారణంగా సామాన్యులకు కలిగే నష్టాలను వివరిస్తూ లేఖ రాశారు.
ఆ లేఖలో ఏం పేర్కొన్నారంటే….
” ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా కొవిడ్ వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడం సరి కాదు. వాక్సిన్లు సేకరించే ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టానుసారం ధరలకు టీకాలు వేసే అవకాశం ఉంది. ఇది పేద ప్రజలను వాక్సిన్‌కు దూరం చేయడమే కాకుండా, డిమాండ్ పెరగడంతో వాక్సిన్ల బ్లాక్ మార్కెట్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించడం కూడా కష్టమవుతుంది. రెమ్‌డిసివిర్ ఇంజక్షన్ల విషయంలో ఏం జరిగిందో చూశాం. నిజానికి కోవిడ్ వాక్సిన్లు ప్రజలకు ఉచితంగా అందించాల్సి ఉంది. అలా వీలు కాకపోతే నామమాత్రపు ధరలో టీకా వేయాలి. 45 ఏళ్లు దాటిన వారికే రెండు డోస్‌ల వాక్సిన్ వేయడానికి సరిపడా సరఫరా ఇప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారికి టీకాలు వేయడం వచ్చే కొన్ని నెలల్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వాక్సిన్ వేసుకునే అవకాశాన్ని ప్రజలకు కల్పించడం అన్నది మంచి ఆలోచనే అయినా, అవసరానికి మించి వాక్సిన్ అందుబాటులో ఉన్నప్పుడే అది సబబు అవుతుంది. వాక్సిన్ విరివిగా అందుబాటులో ఉన్నప్పుడు ఖర్చు చేయగలిగిన స్థోమత ఉన్న వారు తమకు ఇష్టం ఉన్న ఆస్పత్రికి వెళ్లి వాక్సిన్ వేయించుకుంటారు. కానీ డిమాండ్ కంటే చాలా తక్కువగా ఇప్పుడు వాక్సిన్ ఉత్పత్తి అవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి వాక్సిన్ కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు ప్రజల నుంచి ఇష్టానుసారం చార్జీ వసూలు చేసే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతున్నాను.
దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ వాక్సిన్ డోస్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్ డోస్‌లు వేసే వీలుంటుంది. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, వాక్సిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నాను.” అని జగన్ కోరారు. కీలక సమయంలో కీలక సూచనలు చేశారు జగన్. మరి కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.