Idream media
Idream media
కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న కర్నూలు విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రూ.153 కోట్ల వ్యయంతో ఓర్వకల్లు వద్ద నిర్మించిన విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.హర్‌దీప్‌సింగ్ నేడు ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
నత్తను తలపించేలా..!
కర్నూలు జిల్లా ప్రజలు దాదాపు 20 ఏళ్ల నుంచి విమాన ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విమానాశ్రయం నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని గాలికొదిలేశాయి.
చివరకు 2014లో కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు వద్ద 1,008 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. నిర్మాణ పనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి చెందిన కంపెనీకి అప్పగించడంతో భూసేకరణ, ఇతర పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. 2019 సాధారణ ఎన్నికల నాటికి కేవలం 2.2 కిలోమీటర్ల రన్‌వే మాత్రమే పూర్తయ్యింది. మిగిలిన పనులను అసలు మొదలుపెట్టలేదు. అయినా చంద్రబాబు 2019 జనవరి 18న హడావుడిగా విమానాశ్రయాన్ని ప్రారంభించి.. అదే సంవత్సరం ఏప్రిల్ నుంచి విమానాల రాకపోకలు సాగుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. ఇవన్నీ గాలిమాటలుగానే మిగిలిపోయాయి.
ఏడాదిన్నరలో పనులన్నీ పూర్తి..!
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు విమానాశ్రయ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లోని అన్ని పనులను పూర్తి చేయించే బాధ్యతను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు అప్పగించారు. ఆయన కలెక్టర్, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఇతర అధికారులను సమన్వయం చేసుకుంటూ ఏడాదిన్నర కాలంలోనే పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు అదనంగా రూ.75 కోట్లను విడుదల చేయించారు. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఐదు ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అడ్మిన్ బిల్డింగ్, పోలీస్ బ్యారక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, సబ్‌స్టేషన్, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు తదితర పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించారు.
ఏటీసీ, డీజీసీఏ అనుమతులు.. !
కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతులను రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి అనుమతులు వచ్చేలా చేశారు. 2019లో ఏటీసీ, 2020 జనవరి 16న డీజీసీఏ అనుమతులు లభించాయి. ఏరోడ్రోమ్ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ న్యూఢిల్లీలోని డీజీసీఏ కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. దీంతో విమానాల రాకపోకలకు లైన్‌క్లియర్ అయ్యింది.
12.35 గంటలకు లాంఛనంగా ప్రారంభం.!
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ ఉదయం 11.45 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి వెలిగించి, ప్రత్యేక తపాలా స్టాంపు ఆవిష్కరిస్తారు. టెర్మినల్ భవనం దగ్గర దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొని.. 12.35 గంటలకు విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
28 నుంచి సర్వీసులు
కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి ఈ నెల 28న సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఇండిగో బెంగళూరు, చెన్నై, విశాఖకు సర్వీసులను నడపనుంది. బెంగళూరు నుంచి విమానం ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9.05 గంటలకు బయలుదేరి 10.10 గంటలకు కర్నూలు వస్తుంది. అదేరోజు మధ్యాహ్నం 3.15 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 4.25 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో కర్నూలు నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి విశాఖకు 12.40 గంటలకు చేరుతుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 2.55 గంటలకు కర్నూలు చేరుకుంటుంది.చెన్నై నుంచి ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి కర్నూలుకు 4.10 గంటలకు చేరుకుంటుంది. అదే రోజుల్లో కర్నూలు నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకి సాయంత్రం 5.50 గంటలకు చేరుతుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడలకు కనెక్టివిటీ ఫ్లైట్స్ రన్ కోసం ప్రతిపాదించనున్నారు.
ఎయిర్ పోర్ట్ ప్రత్యేకతలివీ
విమానాశ్రయం 1,008 ఎకరాలలో నిర్మించారు. రన్ వే పొడవు 2000 మీటర్లు, వెడల్పు 30 మీ. మొత్తం 4 పార్కింగ్ స్టాండ్స్ ని ఏర్పాటు చేశారు. 4 చెక్ ఇన్ కౌంటర్స్ ని ఏర్పాటు చేయగా.. అందులో రెండింటిని ఇండిగో కి కేటాయించారు. శాసన రాజధానిగా కర్నూలు ని ప్రకటించడంతో రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి ఇతర విమానాశ్రయాలకు మరిన్ని సర్వీసులు ప్రారంభం కానున్నాయి.