iDreamPost
android-app
ios-app

అంత‌కు మించే జ‌గ‌న్ దూకుడు ఉండ‌నుందా?

అంత‌కు మించే జ‌గ‌న్ దూకుడు ఉండ‌నుందా?

ముఖ్య‌మంత్రిగా అధికారం చేప‌ట్టిన తొలిరోజుల్లోనే సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు కేరాఫ్‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిలిచారు. సంక్షేమ రాజ్యంలో కొత్త ఒర‌వ‌డి సృష్టించారు. రెండేళ్ల‌లోనే ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించారు. వ్యవస్ధలో మార్పు తీసుకువచ్చి సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్రజల గడప వద్దకే అందించారు.

ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందనే భ‌రోసా ప్రజలకు క‌ల్పించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం అమ‌లు చేసి సంచ‌ల‌న సీఎంగా పేరు పొందారు. ఐదేళ్ల కాలంలో మొద‌టి స‌గంలోనే ఉత్త‌మ సీఎంగా ప్ర‌జ‌ల నుంచే కాకుండా ప్ర‌ముఖుల నుంచి కూడా ప్ర‌శంస‌లు పొందారు. ఈ క్ర‌మంలో మిగిలిన రెండున్న‌రేళ్ల‌లో జ‌గ‌న్ పాల‌న ఎలా ఉండ‌బోతుంద‌నే చ‌ర్చ మొద‌లైంది.

సాధార‌ణంగా ఎవ‌రైనా మొద‌టి రెండున్నర యేళ్లు ఎలా ప‌ని చేసినా, ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించి మ‌రోసారి ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతారు. జ‌గ‌న్ మాత్రం మొద‌టి నుంచీ ప్ర‌జా పాల‌న సాగిస్తుండ‌డంతో మిగిలిన రెండున్నరేళ్లలో అభివృద్ధిని మ‌రింత పరుగులు పెట్టించి ఐదేళ్ల పాలన  సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. నవరత్నాల్లో మిగిలిన హామీలను కూడా వీలైనంత మేర అమలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.మూడు వేల రూపాయల వరకు పింఛన్ల పెంపు, ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్ రద్దు, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలు కూడా అమలులోకి వస్తాయి. ఒకవేళ వాటిని అమలు చేయలేకపోతే అందుకు గల కారణాలను కూడా ప్రజలకు వివరించేలా ప్లాన్ చేస్తున్నారు.

సంక్షేమ కార్యక్రమాల అమలులో జగన్ ఇప్పటికే నూటికి నూరు మార్కులు సాధించారని చెప్పాలి. ఇతర రాష్ట్రాలు కూడా మన సచివాలయ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. నాడు-నేడు వంటి పథకాలపై దృష్టిసారించాయి. ఈ దశలో అభివృద్ధిలో కూడా ఏపీని దేశానికే ఓ నమూనాగా నిలపాలని అనుకుంటున్నారు జగన్. మూడు రాజధానులను ప్రకటించడమే కానీ, దానిపై ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేసినట్టు కనిపించడంలేదు.

కోర్టు కేసులు ఓ వైపు వెనక్కు లాగుతున్నా, మూడు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ఈ రెండున్నరేళ్లలో పూర్తి స్థాయిలో దృష్టి పెడుతుందని సమాచారం. అధికారికంగా రాజధాని అనే పేరు లేకపోయినా.. కోర్టు కేసులు తేలిన వెంటనే పరిపాలనా కార్యక్రమాలను మార్చేసేందుకు సర్వం సిద్ధం చేయబోతున్న‌ట్లుగా తెలుస్తోంది. మొత్తమ్మీద ఐదేళ్ల జగన్ పాలన చూస్తే రెండున్నరేళ్లు సంక్షేమం, మిగిలిన రెండున్నరేళ్లు అభివృద్ధి అనేలా సాగుతుందని అర్థమవుతోంది. అదే కనుక జరిగితే జగన్ కు ఇక తిరుగుండదు. అలాగే.. ఏపీ వాసులు ఈ రెండున్న‌రేళ్ల‌లో మ‌రిన్ని ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధి పొంద‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.